Sunday, September 8, 2024
HomeTrending NewsGroundnut: యాసంగిలో వేరుశెనగ లాభదాయకం - మంత్రి నిరంజన్ రెడ్డి

Groundnut: యాసంగిలో వేరుశెనగ లాభదాయకం – మంత్రి నిరంజన్ రెడ్డి

పంటల మార్కెటింగ్ అనేది రైతులకు ఇబ్బందికరంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం లేకుండా ప్రపంచం మనుగడ సాగించలేదన్నారు. హైదరాబాద్ ఫిస్సీ సురాన ఆడిటోరియంలో ఈ రోజు నిర్వహించిన ‘వ్యవసాయ మరియు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అవకాశాలు – తెలంగాణ’ అంశంపై జరిగిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగుకు భారతదేశ నేలలు, వాతావరణం అనుకూలమైనవన్నారు. కానీ దానికి తగినట్లుగా దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్య ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయరంగం బలోపేతం అయితే ఆ రంగం మీద ఆధారపడిన ప్రజలు నాలుగైదేళ్లలో వారి కాళ్ల మీద వారు నిలబడతారని.. ఆ దిశగానే తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నదని చెప్పారు.

ప్రభుత్వ చర్యల మూలంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రభాగాన నిలబడిందని, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఎగుమతులను పెంచడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఎగుమతులు పెంచడానికి ఏఏ చర్యలు తీసుకోవాలి అన్నది నిపుణులు, శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు. ప్రపంచ మార్కెట్ ఎగుమతులకు అనుగుణంగా ఎలాంటి నిబంధనలు అనుసరించాలో చైతన్యం చేయాలని, ఒక్కరోజు దిగుమతులలో అంతరాయం ఏర్పడితే బ్రిటన్ ఆకలితో అల్లాడుతుందన్నారు. వారు ప్రపంచానికి ఏమీ ఎగుమతి చేయడం లేదు .. అన్నింటికి దిగుమతుల మీదే ఆధారపడుతుందన్నారు. ప్రపంచంలో 800 కోట్ల జనాభా దాటిపోయింది .. భారతదేశం అత్యధిక జనాభాతో అగ్రస్థానంలో ఉన్నదని, మానవాళికి అవసరమైన దైనందిన అవసరాలను తీర్చుకోవడం కోసం ప్రపంచంలో ఒక దేశం ఇంకో దేశం మీద ఆధారపడడం అనివార్యమయిందన్నారు.

వాణిజ్య ఒప్పందాలు లేకుండా దేశాలు మనుగడ సాగించడం అసాధ్యం .. అది లేకుండా జీవితం లేదని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం మీద దృష్టిపెట్టిన వారికి భవిష్యత్ ఉంటుందని, ప్రపంచ అవసరాలు, డిమాండ్ ఉన్న ఉత్పత్తుల మీద దృష్టిసారించాలని కోరారు. కాలిఫోర్నియా ఆల్మండ్స్ కన్నా మన వేరుశెనగ లో ఎనిమిది రెట్లు ఎక్కువ ప్రొటీన్స్ ఉంటాయని.. కానీ వారు వారి ఉత్పత్తికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించారని వివరించారు. ప్రపంచంలోని అనేక దేశాలలో పీనట్ బట్టర్ కు డిమాండ్ ఉన్నదని, తెలంగాణలో యాసంగిలో వేరుశెనగ సాగుకు రైతులను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అప్లాటాక్సిన్ రహిత తెలంగాణ వేరుశెనగకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నదని, ఉచిత చేపపిల్లలతో మత్స్య పరిశ్రమ, సబ్సిడీ గొర్రెలతో గొర్రెల పెంపకం ప్రోత్సాహంతో తెలంగాణలో గణనీయంగా వాటి ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. వాటి ఎగుమతుల మీదా దృష్టిసారించాలని, సులభంగా కాకుండా పనిచేసి కష్టపడి జీవించగలం అన్న ఆలోచనలు పెరగాలని మంత్రి సూచించారు. సదస్సులో ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ నీరజా ప్రభాకర్, టీఎస్టీపీసీ జేఎండీ విష్ణువర్దన్ రెడ్డి, ఫిస్సీ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్