Saturday, January 18, 2025
HomeTrending Newsమహారాష్ట్రలో ఎంఐఎం సంచలన నిర్ణయం

మహారాష్ట్రలో ఎంఐఎం సంచలన నిర్ణయం

మహారాష్ట్రలో ఆరు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమికి ఏఐఎంఐఎం(మజ్లిస్) పార్టీ మద్దతు ప్రకటించింది. మహారాష్ట్రలోని ఇద్దరు ఎంఐఎం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హికి ఓటు వేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. పోలింగ్‌కు కొద్ది గంటల ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ మేరకు ఔరంగాబాద్‌ ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ట్వీట్ చేశారు. మహావికాస్ అఘాడీలోని భాగస్వామి శివసేనతో రాజకీయ సైద్ధాంతిక విభేదాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

‘‘బీజేపీని ఓడించేందుకు మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి ఓటు వేయాలని మా పార్టీ (ఏఐఎంఐఎం) నిర్ణయించింది.. అయితే మా రాజకీయ సైద్ధాంతిక విభేదాలు ఎంవీఏ భాగస్వామి శివసేనతో కొనసాగుతాయి.. కాంగ్రెస్,ఎన్‌సీపీలు ఈ కూటమిలో ఉన్నాయి’’ అని జలీల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హికి ఓటు వేయాలని మా పార్టీ మహారాష్ట్ర ఎమ్మెల్యేలను కోరాను.. ఇమ్రాన్‌కు మా శుభాకాంక్షలు’’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఉటంకిస్తూ మరో ట్వీట్‌ చేశారు. తమ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ధూలే, మాలేగావ్‌ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి కొన్ని షరతులు విధించినట్టు ఎంపీ జలీల్ చెప్పారు.

మహారాష్ట్రలోని మొత్తం 6 స్థానాలకు శివసేన 2, కాంగ్రెస్‌, ఎన్సీపీ చెరో స్థానానికి పోటీ చేశాయి. బీజేపీ కూడా ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థి విజయం సాధించాలంటే 42 మంది మద్దతు కావాల్సి ఉంది. అయితే, శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు ఒక్కోస్థానంలో గెలిచేందుకు కావాల్సిన బలం ఉంది. 106 సభ్యులున్న బీజేపీకి రెండు సీట్లను గెలువగలదు. కేవలం ఆరో స్థానంలో మాత్రమే హోరాహోరీ పోరు నెలకుందది. అయితే, ఎన్‌సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అవకాశం లభించకపోవడం మహావికాస్‌ అఘాడీకి సమస్యగా మారింది. ఇదే సమయంలో ఎంఐఎం వారికి మద్దతు తెలపడం ఊరట నిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్