భారత సంతతికి చెందిన అజయ్ బంగా బుధవారం ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన జూన్ 2, 2023న తన పదవిని స్వీకరించనున్నారు. ఆయన పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది. బుధవారం జరిగిన 25 మంది సభ్యుల ఎగ్జిక్యూటివ్ బోర్డు మీట్‌లో అజయ్ బంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు అజయ్ బంగా మాస్టర్ కార్డ్ సీఈవోగా ఉన్నారు. ఆర్థిక, అభివృద్ధి పనుల్లో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్.. తన పదవీకాలం పూర్తికాకముందే పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. డేవిడ్ మాల్పాస్ తన రాజీనామాను ప్రకటించిన తర్వాత ఫిబ్రవరిలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవికి అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నామినేట్ చేశారు. దీంతో అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ కావడం దాదాపు ఖాయమని భావించారు. అజయ్ బంగాను నామినేట్ చేస్తూ జో బిడెన్.. ప్రతికూల వాతవరణంలోని సవాళ్లను ఎదుర్కోవడంలో బంగాకు చాలా అనుభవం ఉందని చెప్పారు. అటువంటి పరిస్థితితులలో బంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగం నుండి వనరులను సేకరించగలడని భావిస్తున్నామన్నారు.
అజయ్ బంగా భారత సంతతికి చెందినవారు. అతని పూర్తి పేరు అజయ్‌పాల్ సింగ్ బంగా. అజయ్ బంగా 10 నవంబర్ 1959న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. అతని తండ్రి హర్భజన్ సింగ్ బంగా భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేశారు. ఆయన కుటుంబం పంజాబ్‌లోని జలంధర్‌కు చెందినది. బంగాకు 2007లో అమెరికా పౌరసత్వం లభించింది. బంగా సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. బంగా 1980 సంవత్సరంలో నెస్లే ఇండియాతో తన కెరీర్ ప్రారంభించారు. 10 సంవత్సరాలకు పైగా మాస్టర్ కార్డ్ సీఈఓ గా పనిచేశారు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌కి వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆర్థిక రంగంలో అజయ్ బంగా చేసిన కృషికి భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. అజయ్ బంగా జూన్ 2, 2023న ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.