తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలాయ్ బలాయ్. రాజకీయ నేతలను ఏక తాటిపైకి తీసుకువచ్చే పండగ. కుల, మతాలకు అతీతంగా ప్రతి ఏటా దసరా మరుసటి రోజు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహిస్తూ వస్తున్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా అలాయ్ బలాయ్ వేడుక ప్రారంభమైంది. ఈ వేడుకకు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, కిషన్‌రెడ్డి, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు.
ఈ ఏడాది బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి సినీ నటుడు చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… అలయ్ బలయ్ అనేది తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఉందని చెప్పారు. గతంలో ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్, అల్లు అరవింద్ హాజరయ్యారని… తాను కూడా హాజరు కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని… ఇప్పటికి అది సాధ్యమయిందని తెలిపారు.
అలయ్ బలయ్ కార్యక్రమం ఒక ఉన్నతమైన కార్యక్రమం అని… దీనికి దత్తాత్రేయ గారు విశేషమైన ప్రాచుర్యాన్ని కల్పించారని చిరంజీవి కొనియాడారు. ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పంచే అద్భుతమైన కార్యక్రమమని చెప్పారు. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరగాలని అన్నారు. మనం చెప్పలేని దాన్ని గుండె చప్పుడు చెపుతుందని… మాటకు లొంగని వ్యక్తి కూడా హృదయ స్పందనకు లొంగుతాడని చెప్పారు. అలయ్ బలయ్ వేడుకల్లో చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ ఏడాది బిజెపి మినహా ఇతర పార్టీలకు చెందిన నేతలు ఎక్కువగా హాజరు కాలేదు.
ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలతోపాటు కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మాజీ ఎంపీలు జీ వివేక్, వీ హనుమంతరావు, మాజీ మంత్రి బాబూ మోహన్, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు.
అలయ్ బలయ్ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డబ్బు వాయించారు. కాగా మటన్, చికెన్, పాయా, హలీం లాంటి నాన్ వెజ్ వంటలతోపాటు… నోరూరించే వివిధ రకాల పిండి వంటలు అతిథులకు వడ్డిస్తున్నారు. అతిథులకు తెలంగాణ రుచులు చూపించే విధంగా పలు వంటకాలు చేశారు.