Major Turn: మొదటి నుంచి కూడా అడివి శేష్ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ‘క్షణం’ .. ‘ గూఢచారి’ సినిమాలు నటుడిగా ఆయన ప్రతిభకు అద్దం పడతాయి. ఆయన తాజా చిత్రంగా రూపొందిన ‘మేజర్’ జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్రగా నిర్మితమైన ఈ సినిమాలో కథానాయికగా సయీ మంజ్రేకర్ నటించగా, తీవ్రవాదుల చేతికి చిక్కినవారిలో ఒకరిగా ‘ప్రమోద’ పాత్రలో శోభిత ధూళిపాళ కనిపించనుంది. ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. రేవతి కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో అడివి శేష్ మాట్లాడుతూ .. “ఈ సినిమా చేయాలనే ఆలోచన రాకముందే నేను ‘సందీప్ ఉన్నికృష్ణన్’ అభిమానిని. ఆయన ధైర్యసాహసాలు .. త్యాగనిరతిని గురించి నేను అప్పట్లోనే విన్నాను. అయితే ఈ సినిమా చేయాలనుకున్న తరువాత ఆయన గురించిన మరిన్ని విషయాలను తెలుసుకునే అవకాశం కలిగింది. ‘మేజర్’ సినిమాలో తీవ్రవాదుల దాడిని గురించి మాత్రమే చూపిస్తారని అంతా అనుకుంటారు. కానీ ఆ ఎటాక్ కి ముందు సందీప్ ఉన్నికృష్ణన్ గారి లైఫ్ ఎలా ఉండేదనే విషయాన్ని కూడా ఈ సినిమాలో చూపిస్తున్నాము. చాలామందికి తెలియని విషయం ఇదే.
ఈ సినిమాలో హీరో బాల్యం నుంచి ఆయన చనిపోయేవరకూ గల జర్నీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆయన అడుగులు లక్ష్యం వైపు ఎలా సాగాయి? తల్లిదండ్రుల పట్ల .. భార్యపట్ల ఆయన ఎమోషన్స్ ఎలా ఉండేవి? సమాజం పట్ల ఆయన ఆలోచన ఎలా ఉండేది? అనే అంశాలన్నిటినీ కలుపుతూ ఈ కథ నడుస్తుంది. ఇందులో యాక్షన్ తో పాటు యూత్ కి నచ్చే లవ్ ట్రాక్ ఉంది .. ఫ్యామిలీ ఆడియన్స్ లో కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో చేసే అవకాశం నాకు దక్కడం గర్వంగా ఉంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు గర్వపడేలానే ఈ సినిమా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు.