Sunday, January 19, 2025
HomeTrending NewsSanathnagar: ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం - మంత్రి సబితా

Sanathnagar: ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం – మంత్రి సబితా

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులు విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలిపారు. సోమవారం సనత్ నగర్ లోని అశోక కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ మన బడి కార్యక్రమం క్రింద 2.22 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను, బన్సీలాల్ పేట లోని ప్రభుత్వ పాఠశాలలో 1.84 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 16 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను, MLC నిధులు 25 లక్షల రూపాయలు, ACDP నిధులు 7.70 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 3 అదనపు తరగతి గదులను ప్రారంభించారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, MLC సురభి వాణిదేవి, విద్యాశాఖ కమిషనర్ దేవసేన లతో కలిసి ప్రారంభించారు. పేద విద్యార్ధులు అధికంగా విద్య అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో మన బస్తీ మన బడి కార్యక్రమంతో అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.

అదేవిధంగా గురుకుల పాఠశాలలను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని వివరించారు. అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తూ ప్రవేట్ స్కూల్స్ కు పంపిస్తుంటారని చెప్పారు. ప్రభుత్వ స్కూల్స్ లో అన్ని సౌకర్యాలు కల్పించబడుతున్నాయని, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించడం జరిగిందన్నారు.

పేద ప్రజలు అధికంగా నివసించే బన్సీలాల్ పేట డివిజన్ లోని మేకల మండి లో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి ఉన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సోమవారం మేకల మండి పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక MLA, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ పాఠశాలను 2011 సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల గా ప్రారంభించడం జరిగిందని, 2020 సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల గా అప్ గ్రేడ్ చేయించడం జరిగిందని చెప్పారు.  ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, విద్యాధికారి రోహిణి, పాఠశాల ప్రదానోపాద్యాయుడు మల్లిఖార్జున్, కార్పొరేటర్ హేమలత, పద్మారావు నగర్ BRS ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, పాఠశాల కమిటీ సభ్యులు చంద్రశేఖర్, నర్సింగ్ రావు, రాజు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్