బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులున్న ప్రాజెక్టులన్ని కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేసింది. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిపై అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్న గెజిట్ నోటిఫికేషన్. ఈ మేరకు కృష్ణానదిపై 36, గోదావరి నదిపై 71 ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి వస్తాయి. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలని కేంద్రం స్పష్టీకరణ. అనుమతులు రాకపోతే ప్రాజెక్టుల నిర్మాణం నిలిపివేయాలని, బోర్డులకు చైర్మన్లు, సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజినీర్లు ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉంటారు.
ఇక నుంచి అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులే చూసుకుంటాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలి. సీడ్ మనీ కింద 60 రోజుల్లో డిపాజిట్ చేయాలి. నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాలని గెజిట్ లో పేర్కొన్నారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు, విద్యుదుత్పత్తిని బోర్డే పర్యవేక్షిస్తుందని కేంద్ర జల్‍శక్తి శాఖ తేల్చి చెప్పింది.
కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిపై తాజా గెజిట్ నోటిఫికేషన్ తో అన్ని అధికారాలు కేంద్రానికి కట్టబెట్టినట్టయింది. రాష్ట్రాల మధ్య సఖ్యత లేకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలన్నీ కేంద్రం పరిధిలోకే వెళ్తాయి. ఇప్పటికైనా నది జలాల సమస్యను రాజకీయ కోణంలో కాకుండా సంభందిత రాష్ట్రాలు విజ్ఞతతో వ్యవహరించి, ఉభయతారకంగా నిర్ణయాలు తీసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు.