టాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘బేబీ’ మూవీ కల్ట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని సినిమా టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ రావడం పట్ల సినిమా టీమ్ కృతజ్ఞతను, సంతోషాన్ని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో
వైష్ణవి చైతన్య మాట్లాడుతూ – అల్లు అర్జున్ గారి నటన అంటే ఇష్టం. ఆయన నాకొక ఇన్సిపిరేషన్. నేను ఇవాళ బాగా నటించానని పేరొచ్చిందంటే అందులో ఐకాన్ స్టార్ ఇచ్చిన స్ఫూర్తి కూడా ఉంటుంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావనే పేరును బేబీ మార్చేసింది. ప్రయత్నిస్తే ఇక్కడి అమ్మాయిలు కూడా సక్సెస్ అందుకుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, డైరెక్టర్ సాయి రాజేశ్ కృతజ్ఞతలు చెబుతున్నా. ఇంత వర్షంలోనూ బేబీ థియేటర్స్ ఫుల్ అవుతున్నాయంటే మా సినిమా ఎంత సక్సెస్ సాధించిందో ఊహించుకోవచ్చు. అని చెప్పింది.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – సాయిరాజేశ్ ఈ సినిమా కోసం నా దగ్గరకు వచ్చి 20 నిమిషాలు కథ చెప్పాడు. చేద్దామన్నా అని ఒప్పుకున్నా. అయితే ఇందులో 6 నిమిషాల పాట ఒకటి సింగిల్ టేక్ లో చేయాలి అన్నాడు. నాకు డ్యాన్సులు రావు సింగిల్ టేక్ సాంగ్ అంటున్నాడు అని భయపడ్డా. కొద్ది రోజుల పాటు అల్లు అర్జున్ అన్న పాటలు, డాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేశా. అలా మీరు మాకు ఇన్సిపిరేషన్ ఇస్తూనే ఉంటారు. నేను అనుకోకుండా నటుడిని అయ్యా. అయితే సినిమాలో మన క్యారెక్టర్ బాగా చేస్తే నటుడిగా గుర్తింపు వస్తుందని ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. అల్లు అర్జున్ అన్న కూడా ఎన్ని ఆటంకాలు దాటి ఇంత పెద్ద స్టార్ అయ్యాడో మనకు తెలుసు. మా టీమ్ కు మీ విశెస్ ఎప్పుడూ కావాలి. అన్నారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ – బేబీ సినిమా టోటల్ టీమ్ కు నా కంగ్రాంట్స్ చెబుతున్నా. సినిమాను చించేశారు. 7జీ బృందావన్ కాలనీ, అర్జున్ రెడ్డి లాంటి కొన్ని సినిమాలే ప్రేమలోని బాధను తెలియజేస్తాయి. అలాంటి సినిమాలు తీయడం కష్టం. ఎందుకంటే అలాంటి లవ్ పెయిన్ చూపించే కథలు సులువుగా రావు. మన జీవితంలో చూస్తేనే, అనుభూతి చెందితేనే వస్తాయి. లైఫ్ నుంచి స్పూర్తి పొందితేనే బేబీ లాంటి సినిమా తీయగలం. ఒకరోజు బేబీ ఫస్ట్ హాఫ్, మరో రోజు సెకండాఫ్ చూశా. సినిమా పూర్తయ్యాక సిక్సర్ కొట్టారు అనిపించింది. ఈ సినిమా గురించి గంట సేపు చెప్పగలను. ఇందులో చాలా అంశాలు నచ్చాయి. సినిమా రాసిన విధానం, తెరకెక్కించిన విధానం, ఆర్టిస్టుల పర్మార్మెన్సులు ఇలా ప్రతీది ఆకట్టుకుంది. వీళ్ల పర్మార్మెన్స్ చూసి షాక్ అయ్యాను. వారి నటనలో ఎంతో జెన్యూనిటీ ఉంది. చిన్నసినిమాలు థియేటర్ లో ప్రేక్షకులు చూడటం లేదు అనేది అబద్ధం. సినిమా బాగుంటే మీడియా, ప్రేక్షకులు నిజాయతీగా మద్దతు, ప్రేమ ఇస్తారు, అందుకు బేబీ సక్సెస్ నిదర్శనం. ఒక తల్లి బేబీని కనడానికి ఎంత కష్టపడుతుందో ఈ బేబీ సినిమా మేకింగ్ కోసం డైరెక్టర్ సాయిరాజేశ్ అంత కష్టపడ్డాడు.
సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరు ఎలా ఎదుగుతారో తెలియదు, అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సాయిరాజేశ్. కలర్ ఫొటో సినిమా చూసినప్పుడే అతను మంచి దర్శకుడు అనిపించింది. సాయిరాజేశ్ స్క్రిప్ట్ రాసిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్..ఇలా అందరూ పాత్రల్లో జీవించారు. నాకు పర్సనల్ గా ఇలాంటి కథలు ఇష్టం. అందుకే బేబీ నచ్చిందేమో. ఈ సినిమా మీద ఆనంద్ పెట్టుకున్న నమ్మకమే ఈ సక్సెస్. విరాజ్ చాలా క్యూట్ గా ఉన్నాడు. చాలా బాగా డీసెంట్ నటించాడు. అవార్డుల ఫంక్షన్స్ లో మన హీరోయిన్స్ కనిపించక బాధనిపించేది. ఇవాళ మన తెలుగమ్మాయి వైష్ణవి హిట్ కొట్టడం సంతోషంగా ఉంది. అని చెప్పారు.