వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్ అన్నారు. అల్లూరి సీతారామరాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన వేడులకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అందరికి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మన్యం వీరుడి జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు.
జల్ జంగల్ జమీన్ నినాదంతో కుమ్రం భీమ్ ఈ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం నాటి నిజాం ప్రభువు పై తెగించి పోరాడారని చెప్పారు. అదేవిధంగా తెలుగుజాతిని ప్రభావితం చేసేలా అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులపై దీరోధాత్తంగా పోరాటం సలిపారని వెల్లడించారు. అలాంటి వీరుల స్ఫూర్తితో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని ఖానామెట్‌లో అల్లూరి భవన నిర్మాణం కోసం మూడెకరాల భూమిని సీఎం కేసీఆర్ కేటాయించారని తెలిపారు.