గ్రామీణ నేపథ్యంలో కథలకు ఇప్పుడు మరింతగా డిమాండ్ పెరిగిపోయింది. చిన్న సినిమాలు ఎక్కువగా గ్రామాలనే ఆశ్రయిస్తూ ముందుకు వెళుతున్నాయి. ఏ మాత్రం కంటెంట్ కనెక్ట్ అయినా ఆ సినిమాలు ఒక రేంజ్ వసూళ్లను చూస్తున్నాయి. అలా నిన్న థియేటర్లకు వచ్చిన సినిమానే ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండు’. సుహాస్ హీరోగా చేసిన ఈ సినిమాతో, శివాని నాగరం కథానాయికగా పరిచయమైంది. దుష్యంత్ కటికినేని ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.
ఈ కథలో హీరో ఉన్నాడు .. హీరోయిన్ ఉంది .. అక్కాతమ్ముళ్ల ఎమోషన్ ఉంది .. ఆ ఫ్యామిలీతో గొడవపెట్టుకోవడానికి ఒక విలన్ ఉన్నాడు. ఇలా చూస్తేనే ఇలాంటి కథలు ఇంతకుముందు చాలానే వచ్చాయికదా అనిపిస్తుంది. అలా అనిపించకూడదు అంటే, అందులో ఏదో ఒక కొత్త పాయింటు ఉండాలి .. ఉందని ఆడియన్స్ కి అర్థం కావాలి. లేదంటే ఆ దారిలో వచ్చిన సినిమాలలో ఇది ఒకటిగా చేరిపోతుంది. అలాంటి ముద్ర నుంచి బయటపడటానికి ఈ దర్శకుడు గట్టిగానే ట్రై చేశాడు.
ఈ సినిమా టైటిల్ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. కానీ ఆ ప్రస్తావన తక్కువగా కనిపిస్తుంది. కథ ఎక్కువగా ‘సెలూన్ షాప్’ చుట్టూ తిరుగుతుంది. తన ఇంటి కిచెన్ లోకి వెళ్లినంత ఈజీగా లవర్ కోసం సెలూన్ షాప్ కి వచ్చే హీరోయిన్, ‘నీ ఇష్టం అన్నయ్యా’ అంటూ ఆడియన్స్ కి షాక్ ఇస్తుంది. హీరోయిజాన్నీ… విలనిజాన్ని దర్శకుడు బాగానే హ్యాండిల్ చేశాడు. కాకపోతే కొత్త పాయింట్ ను టచ్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఇది యథార్థ సంఘటన అన్నారు గనుక, సర్ది చెప్పుకోవలసిందే .. సరిపెట్టుకోవలసిందే.