Sunday, November 10, 2024
Homeసినిమాఅంబాజీపేట కుర్రాడిగా సుహాస్ కి హిట్ పడేనా? 

అంబాజీపేట కుర్రాడిగా సుహాస్ కి హిట్ పడేనా? 

సుహాస్ .. 2018లోనే టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి చిన్న చిన్న పాత్రలను వేయడం మొదలుపెట్టాడు. సుహాస్ వాయిస్ బాగుంటుంది .. యాక్టింగ్ కూడా చాలా నేచురల్ గా అనిపిస్తుంది. కానీ ఆయన హీరో అవుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ ‘కలర్ ఫొటో’ సినిమాతో సుహాస్ హీరో అయ్యాడు. కాస్త గుర్తింపు రాగానే హీరోగా ట్రై చేయడమనేది సాధారణమైపోవడం వలన ఎవరూ అంతగా పట్టించుకోలేదు. స్నేహితులతో కలిసి ఒక ట్రైల్ వేసి ఉంటాడని భావించి లైట్ తీసుకున్నారు.

సందీప్ రాజ్ దర్శకత్వంలో 2020లో వచ్చిన ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. చిన్న సినిమాలలో పెద్ద విజయాన్ని అందుకున్నవాటి  జాబితాలో చేరిపోయింది. సుహాస్ హీరోగా కూడా మెప్పించగల కంటెంట్ ఉన్నవాడనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది. అయితే ఆ తరువాత కూడా హీరోగా మాత్రమే చేస్తానని సుహాస్ కూర్చోలేదు. అంతకుముందు మాదిరిగానే తనకి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే ఆయనకి ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా పడింది.

షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాపై కూడా పెద్దగా అంచనాలు లేవు. పోస్టర్స్ కూడా కాస్త క్లాస్ టచ్ తో ఉండటంతో కష్టమేనని చాలామంది అనుకున్నారు. కానీ ఈ సినిమా మౌత్ టాక్ తో దూసుకెళ్లింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎక్కువగా టచ్ చేసింది. వాళ్ల నుంచి వసూళ్లతో పాటు ప్రశంసలను అందుకుంది. సుహాస్ కథల ఎంపికపై నమ్మకాన్ని కలిగించిన సినిమా ఇది. ఇక ఇప్పుడు ఆయన నుంచి రావడానికి ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సిద్ధమైంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాతో హీరోగా సుహాస్ మరో హిట్ కొడతాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్