Saturday, November 23, 2024
HomeTrending Newsచర్చకు సిద్ధమా?: హరీష్ కు అంబటి సవాల్

చర్చకు సిద్ధమా?: హరీష్ కు అంబటి సవాల్

కేసిఆర్  తో ఏమైనా తగాదాలుంటే అక్కడ తేల్చుకోవాలి తప్ప తమపై వ్యాఖ్యలు చేసే అర్హత హరీష్ రావుకు లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాము విడిపోయినవారమని, రెవెన్యూ తక్కువగా ఉందని…. అయినా సరే దేశంలోనే అత్యద్భుతంగా సంక్షేమం  అమలు చేస్తున్నామని, తమపై వేలెత్తి చూపే అర్హత వారికి లేదని స్పష్టం చేశారు. ఎవరు బెటరో తేల్చుకోవడానికి చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తమను విమర్శిస్తే అక్కడ బలోపేతం అవుతామని వారు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం పార్టీ ఇంటింటికీ వెళ్లి తాము వైఎస్సార్సీపీ కంటే బాగా పాలించామని చెప్పే ధైర్యం చేయగలదా అని అంబటి ప్రశ్నించారు. రైతుల వద్దకు వెళ్లి తాము గతంలో ఇంతకంటే బాగా చేశామని చెప్పాలన్నారు. ఏమీ చేయకపోగా తాము ప్రజలకు మంచి చేస్తుంటే ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.  పోలవరం సర్వనాశనం కావాలని, రాష్ట్రం శ్రీలంక లాగా అవ్వాలని వారు కోరుకుంటున్నారని…. కానీ విజయవాడ-గుంటూరు మధ్య వారు కోనుగోలు చేసిన భూముల ధరలు గజం లక్ష రూపాయలు కావాలని ఆశిస్తున్నారని రాంబాబు విమర్శించారు.  తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టుపై ఉమ్మడి  సర్వేకు ఒడిశా, తెలంగాణా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలు పట్టుబడుతున్నాయంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తపై రాంబాబు స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు ఏదో జరిగిపోతుందంటూ  అపోహలు సృష్టించడమే వారి ఉద్దేశమని అన్నారు. పోలవరంపై మన పరిసర రాష్ట్రాలకు ఉన్న అపోహలు, సందేహాలు తీర్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, దానిలో భాగంగానే మొన్నటి సమావేశం జరిగిందని వివరించారు.

అమరావతి పాదయాత్రపై మరోసారి అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది రైతుల పాదయాత్ర కాదని, ఇది ఒళ్ళు బలిసిన వారి పాదయాత్ర అని, మళ్ళీ మళ్ళీ మాట్లాడితే కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాదయాత్రకు వ్యతిరేకంగా కడుపు మండేవారు, గుండె రగిలే వాళ్ళు పాదయాత్ర ప్రారంభిస్తే దానికి చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు.

Also Read ఈ పోకడలు మంచివి కావు :విజయసాయి

RELATED ARTICLES

Most Popular

న్యూస్