గతంలో చంద్రబాబును ఇష్టం వచ్చినట్లు తిట్టి ఇప్పుడు ఆయనకు పాలాభిషేకం, పాదాభి షేకం చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణకు నైతిక విలువలు లేవని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి సిద్దమై, చివరి నిమిషంలో బిజెపి పెద్దల ఒత్తిడితో మనసుమార్చుకున్న కన్నాకు జగన్ ను విమర్శించే నైతిక అర్హత ఉందా అని ప్రశ్నించారు. రాజారెడ్డి, వైఎస్సార్, జగన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు. సత్తెనపల్లికి ఇన్ ఛార్జ్ లు ఎంతో మంది వచ్చారు, పోయారని… ఇప్పుడు కన్నా కూడా చివరి వరకూ ఉంటారో ఉండరో నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.
తనపై చేసిన వ్యాఖ్యలపై కూడా అంబటి స్పందించారు. తాను రేపల్లెలో పుట్టిన మాట వాస్తవమేనని, ఇప్పుడు సత్తెనపల్లికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నానని, తన సంగతి ఏమిటో ఇక్కడ అడగొచ్చని, రేపల్లెలో అడగాల్సిన అవసరం లేదన్నారు. కన్నా సంగతి ఏమిటో బిజెపిని అడిగితే చెబుతారని, ఎన్నికల ఖర్చుల కోసం కేంద్ర నాయకత్వం డబ్బులు పంపిస్తే వాటిని కొట్టేసిన కన్నా జగన్, తనపై విమర్శలు చేయడం ఏమిటన్నారు. కన్నా ఏమిటో ఆయన ఇంటిముందు ఉన్న ఫ్లెక్సి ని అడిగితే చెబుతుందన్నారు. మాట్లాడేటప్పుడు నియంత్రణ లేకపోతే అంతకంత సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోవడానికి తాము చంద్రబాబును కాదన్నారు.