Beware of Dogs: మా అబ్బాయికి చిన్నప్పుడు కుక్కలంటే చాలా భయం. కుక్క కనిపిస్తే అడ్డదిడ్డంగా పరుగెత్తేవాడు. గోడలెక్కేసే వాడు. రోడ్డుమీదికి వెళ్లిపోయేవాడు. మాకు చాలా ఆందోళనగా ఉండేది. ఆ భయంలో ఎక్కడ దెబ్బలు తాకించుకుంటాడో అని. కుక్కని పెంచడమే దీనికి పరిష్కారంగా తోచింది. ఎవరో పోలీస్ డాగ్ అని చెప్తే ఒక కుక్కని పెంచాం . కానీ ఎంత ప్రయత్నించినా అది అరవకుండా కరవకుండా ఉండేది కాదు. చివరకి తెలిసింది అది మంచి కుక్క కాదని. ఎవరికో ఇచ్చేశాం. తర్వాత ఒక చిన్న లాబ్రడార్ పిల్లని తెచ్చాం. దీనితో మా వాడికి బాగానే స్నేహం కుదిరింది. అయినా అపార్టుమెంట్లో కాకుండా ఆఫీసులో ఉంచి సంరక్షించాం. మా ఆశ వమ్ము కాలేదు. త్వరగానే మా అబ్బాయి భయం పోయింది. అయితే వీధి కుక్కలంటే ఇప్పటికీ భయమే. నిజం చెప్పద్దూ, నాకూ భయమే . రోడ్ మీద నడుస్తుంటే అరుచుకుంటూ వచ్చే కుక్కలు ఆందోళన కలిగిస్తాయి. వీటిని అదుపుచేసే వారే కనిపించరు.
తాజాగా ఒక పిల్లవాడిని కుక్కలు చుట్టుముట్టి చంపిన వైనం మరోసారి పాలనా వైఫల్యాన్ని ఎత్తి చూపింది. విశ్వనగరంలో మనుషుల ప్రాణాలకు విలువలేదని మరోసారి రుజువైంది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారమవుతున్న సీసీ కెమెరా దృశ్యాలు కంట తడి పెట్టిస్తున్నాయి. కుక్కలకు దూరంగా ఉండటమే కాక వాటినుంచి ఎలా తప్పించుకోవాలో కూడా శిక్షణ ఇవ్వాలేమో.
ఇళ్లలోనే కాకుండా రోడ్ల మీద కూడా కుక్కలున్నాయి జాగ్రత్త అనే బోర్డులు పెట్టాలి. ఒక్క హైదరాబాద్ లోనే అయిదు లక్షలకు పైగా వీధి కుక్కలున్నాయని మేయర్ చెప్తున్నారు. ఇకముందు ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూనే కుక్కలు ఆకలితో ఉండటం వల్లే దాడి చేశాయనటం బాధ్యతా రాహిత్యం. ఇరవైనాలుగు గంటలూ కాన్వాయిల్లో తిరిగే బడా బాబులకు ఈ బాధలు ఎలా తెలుస్తాయి? జంతు ప్రేమికులన్నా స్పందించి కేవలం కుక్కలనే కాకుండా మనుషులను కూడా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
కె. శోభ
Also Read :
Also Read :
Also Read :