భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి.. వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం రేసులో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున ఆయన తన అభ్యర్ధిత్వం కోసం ప్రచారం కొనసాగించారు. ఆ పార్టీ తరపున అధ్యక్ష రేసుకు సిద్దమైన రెండవ ఇండియన్‌గా నిలిచారు. ఇటీవల భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ కూడా తన ప్రచారాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మెరిట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, చైనాపై ఆధారపడడాన్ని తగ్గిస్తామని వివేక్ అన్నారు.
వివేక్ రామస్వామి వయసు 37 ఏళ్లు. ఆయన పేరెంట్స్ కేరళ నుంచి యూఎస్‌కు వలస వెళ్లారు. ఓహియోలోని జనరల్ ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో పనిచేశారు. ఫాక్స్ న్యూస్ ప్రైమ్ టైం షోలో వివేక్ తన అధ్యక్ష అభ్యర్థిత్వ రేసును ప్రకటించారు. జాతీయ ఐడెంటిటీ సంక్షోభంలో పడిందని, 250 ఏళ్లుగా అమెరికాను నడిపిస్తున్న ఆ ఆదర్శకాల ప్రమాదం ఏర్పడినట్లు రామస్వామి తెలిపారు.
సెకండ్ జనరేషన్ ఇండో అమెరికన్ అయిన రామస్వామి.. 2014లో రోయివాంట్ సైన్సెస్ సంస్థను ఏర్పాటు చేశారు. అనేక వ్యాధులకు ఆ ఫార్మసీ కంపెనీ మందుల్ని తయారు చేస్తోంది. ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఆ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉన్నది. రోయివాంట్‌తో పాటు మరికొన్ని హెల్త్కేర్, టెక్నాలజీ కంపెనీలను ఆయన స్థాపించారు. 2022లో స్ట్రయివ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థను ఆయన లాంచ్ చేశారు. రాజకీయాలపై నిపుణత సాధించే ఉద్దేశంతో ఆ సంస్థను డెవలప్ చేశారు.
చైనా లాంటి దేశం నుంచి అమెరికాకు ప్రమాదం ఉందన్నారు. చైనా నుంచి స్వాతంత్య్రాన్ని కోరుతూ డిక్లరేషన్ చేయాలన్నారు. విదేశీ విధానాన్ని మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. మన సార్వభౌమత్వాన్ని చైనా అతిక్రమిస్తోందని, ఒకవేళ ఆ బెలూన్ రష్యాకు చెంది ఉంటే దాన్ని తక్షణమే పేల్చివేసేవాళ్లమని, కానీ చైనా విషయంలో ఆ పనిచేయలేకపోయినట్లు చెప్పారు. ఆధునిక జీవనంలో భాగంగా ఎక్కువ మనం చైనామీదే ఆధారపడుతున్నామని, ఎకనామిక్ కో డిపెండెంట్ బంధాన్ని తుంచుకోవాలని ఆయన అన్నారు.