Tuesday, May 14, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకవులకు కష్టకాలం

కవులకు కష్టకాలం

గురజాడ కవిత్వం మీద ఆనాటి సమకాలిక సంప్రదాయవాదులు ముప్పేట దాడి చేయడంవల్ల గురజాడ కవిత్వానికే ఎనలేని మేలు జరిగిందని ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ సోదాహరణంగా నిరూపించారు. ఊహాలోకాల్లో ప్రబంధ భార సంస్కృత పదబంధాల్లో చిక్కుకున్న కవిత్వాన్ని భూమార్గం పట్టించి తేట తెలుగులో జనసామాన్యానికి గురజాడ ఎలా చేరువ చేశారో వివరించారు. చదువుకోవడానికి, పాడుకోవడానికి రెండిటికీ అనువుగా ముత్యాలసరాలను ఎలా కూర్చారో చాలా లోతుగా విశ్లేషించారు. ఆ చర్చ ఇక్కడ అనవసరం. ఆ వ్యాసం ముగింపులో
1 . కవిత్వం
2 . అకవిత్వం
3 . సుకవిత్వం
4 . కుకవిత్వం
5 . కకావికత్వం
అన్న అయిదు రకాల కవిత్వ రచనతో తెలుగు కవితా లోకం ఉక్కిరి బిక్కిరి అవుతోందని 1975 నాటికే బూదరాజు చాలా బాధపడ్డారు. తరువాతి అర్ధశతాబ్దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఇంకెన్ని కకావికత్వ విభాగాలుగా విభజించి ఉండేవారో!

కవిత్వమొచ్చినా…కక్కొచ్చినా ఆగదని సామెతే ఉన్నదున్నట్లు కక్కేశాక ఇక కవిత్వం గురించి విడిగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది కవికే కక్కొస్తే? తదనంతర పరిణామాల గురించి సామెత దృష్టి పెట్టకపోయినా…సినిమాల్లో జంధ్యాలలాంటివారు చాలా లోతుగా చర్చించారు.

“నాది కవిత్వం కాదన్నవాడిని కత్తితో పొడుస్తా!”
అని జంధ్యాల సినిమాలో ఒక రచయిత్రి రాసిన అకవిత్వం సీన్లు జగద్విదితం.

ఆయన సినిమాలోనే ఊళ్లో ఒక కవి పిచ్చి రచనలు చేసి కనిపించిన ప్రతివాడిని నిలవేసి…కవితలు చదివి వినిపిస్తూ వారి చెవుల్లో రక్తం ధారలుగా కారుతున్నా వదిలిపెట్టడు. ఈ కవి కవిత్వ సర్జికల్ దాడుల నుండి తమను తాము కాపాడుకోవడానికి ఊరు ఉమ్మడిగా ఒక సాహసం చేస్తుంది. ఊరంతా శక్తివంచన లేకుండా చందాలు పోగేసి…ఒక ఏనుగును కొని…ఒక శుభ ముహూర్తాన ఆ ఏనుగు మీద కవిని ఎక్కించి…సన్మానం చేసి…ఊరంతా ఊరేగించి…ఇంట్లో దించి…కవికి ఏనుగును బహుమతిగా ఇచ్చి వెళతారు. కవి పొంగిపోతాడు. ఇన్నేళ్లకు ఊరిజనానికి జ్ఞానోదయమయ్యిందని, తన కవితల్లో మాధుర్యం తెలిసి వచ్చిందని మురిసిపోతాడు. మొదటి రోజు పగలు, రాత్రి హాయిగానే గడుస్తుంది. రెండో రోజు ఏనుగుకు చెరుకు గడలు, పళ్లు పెట్టేసరికి కవికి తలప్రాణం తోకకు వస్తుంది. మూడో రోజుకు ఏనుగుకు పెట్టడానికి ఏమీ ఉండదు. ఏనుగు ఆకలికి భయంకరంగా ఘీంకరిస్తూ ఉంటుంది. పగలు, రాత్రి కవిని నిద్రపోనివ్వదు. కవి ముకుళిత హస్తాలతో ఊరి జనం ముందు నిలుచుని…”అయ్యా బాబూ! అమ్మా తల్లీ! మీరు సన్మానం చేసి నాకు ఏనుగును ఎందుకిచ్చారో తెలిసివచ్చింది. దయచేసి ఏనుగును వెనక్కు తీసేసుకోండి. బతికి ఉంటే ఎక్కడైనా కూలి పని చేసుకుని అయినా ఉంటాను కానీ…ఇక కవిత్వం మాత్రం రాయనే రాయను” అని దీనవదనంతో హామీ ఇస్తాడు. ఊరిజనం నవ్వుకుని కవిని కరుణించి…ఏనుగును వెనక్కు తీసేసుకుంటారు. ఆరోజు నుండి ఆ ఊరికి కవిత్వ సర్జికల్ స్ట్రయిక్స్ బాధ తప్పుతుంది.

అర్థం లేకపోయినా, అర్థం కాకపోయినా ‘రంగ ఘోరంగ’ ప్రాసలను పేర్చి దాన్నే కవిత్వం అనుకోవచ్చు. సంకర మాటలు, దుష్టసమాసాలు, వికృత శబ్దాలను సృష్టించి అవి దేనికో ప్రతీకలని అనుకోవచ్చు. కట్టెద, చూసెద, చేసెద లాంటి ఆధునిక కాలంలో వాడుకలోనే లేని మాటలతో పరమ పురాతన గ్రాంథిక భాషలో రాస్తూ దాన్నే ఆధునికం అనుకోవచ్చు.

“భూతమ్ నా బందమ్
స్వర్గం నా గృహమ్
నేను రాసేదే పద్యమ్
నేనే పాడేదే కావ్యమ్  
గిరులు, సాగరులు
నదులు, సెలయేర్లు లోకాలు, శోకాలు ఇవే నాకు అష్టైశ్వర్యాలు
ఋషులే నా నేస్తాలు
దైవాలే నా సహోదరులు
కిన్నె రులు, కింపురుషులు నా తోటి ప్రయాణికులే
నా వాక్కే కర్ణ కఠోరం
నా బాటే అనితర సాధ్యం
నా మార్గమే స్వర్గ నరక అతీత ద్వారం నేనొక దుర్గంధ సుగంధం
నాచూపు మహోద్రేకం”

ఇది గడచిన సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడెమీ యువపురస్కారం పొందిన కవి కవితల్లో ఒకానొక కాపీముత్యం!

“భూతాన్ని , యజ్ఞోపవీతాన్ని
వైప్లవ్య గీతాన్ని నేను
స్మరిస్తే పద్యం
అరిస్తే వాద్యం
అనల వేదికముందు అస్ర నైవేద్యం
“లోకాలు , భవభూతి శ్లోకాలు
పరమేష్ఠి జూకాల నా మహోద్రేకాలు
నా ఊహ చాంపేయ మాల
రసరాజ్య డోల
నా ఊళ కేదార గౌళ !
గిరులు, సాగరులు, కంకేళికా మంజరులు
ఝరులు నా సోదరులు
నేనొక దుర్గం
నాదొక స్వర్గం
అనర్గళం, అనితర సాధ్యం , నామార్గం .”  అన్న ప్రఖ్యాత శ్రీ శ్రీ కవితను యువకవి సరిగ్గా కాపీ కూడా కొట్టలేక మనల్ను దుర్గంధ నరకకూపంలో; అనితరసాధ్యమైన అతీత ద్వారంలో; కర్ణ కఠోరమైన బాటలో పడేశాడన్న సాహిత్య ఇంగితజ్ఞానం కూడా అకాడెమీ తలకాయలకు ఎందుకు లేకపోయింది? అని లోకం ప్రశ్నించలేదు. అంటే సమకాలీన కవులేమి రాస్తున్నారో? కవిత్వంలో అవార్డులెవరికి ఎందుకు ఎలా ఎప్పుడు వస్తున్నాయో లోకం పట్టించుకోవడం ఎప్పుడో మానేసింది. దుర్గంధ మహోద్రేకంతో కవులు లోకాన్ని అంటరానిదిగా చూసి మరో లోకంలోకి వెళ్లినట్లే…ఆ దుర్గంధం మాకెందుకు అని లోకం కూడా అదే మహోద్రేకంతో ఆ కవులను వేలేసింది.

చూడబోతే కృత్రిమ మేధ- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏ ఐ కర్ణ కఠోర కవితలను రాయమన్నా రాసేలా లేదు. మెడకాయ మీద తలకాయ ఉన్న మనుషులు రాసే దుర్గంధ బంధుర మహోద్రేకపు కవితలతో పోలిస్తే ఏ ఐ చాట్ బోట్ కవితలు కోటిరెట్లు నయంగా ఉన్నాయి. ఇప్పుడు కవితలు రాసే కెమెరాలు కూడా వస్తున్నాయి.

ఒక అందమైన దృశ్యాన్ని చూడగానే రసహృదయం ఉన్నవారికి ఏవేవో భావాలు పొంగుకొస్తాయి. కొంచెం రాయడం అలవాటు ఉన్నవారికి కవిత్వం తన్నుకొస్తుంది. అందమైన దృశ్యాన్ని ఫోటో తీయగానే అందులో ఉన్న రంగులు, రూపాలు, ప్రత్యేకతల ఆధారంగా అంతే అందమైన కవితలను తనంతట తానే రాసే కెమెరాను అమెరికాలో తయారు చేశారు. ఇందులో ఎక్కించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్ వేర్ ఆధారంగా దృశ్యానికి తగిన కవితను కెమెరా రాసి పెడుతుంది.

బాబ్బాబూ! అర్జెంటుగా ఆ కెమెరాను తెలుగు కవితలు రాసేలా కూడా రూపొందించి…వీలైనంత త్వరగా షిప్పింగ్ చేయండి నాయనా!
ఇక్కడ మేము కవుల కవిత్వ సర్జికల్ స్ట్రయిక్స్ కు ఇన్సూరెన్స్ లేక చస్తున్నాం.

రసాయన శాస్త్రంలో సాల్ట్ అనాలసిస్ పరీక్షలా కవిత్వ రసాయనంలో కూడా రసముందో లేదో చిటికెలో చెప్పే ఏ ఐ సాఫ్ట్ వేర్లు రేపో మాపో ఏవో ఒకటి రాకపోవు.

అన్నిట్లో కృత్రిమ మేధ రాజ్యమేలే కలికాలం. కవులన్న జాతే అంతరించిపోయేలా ఉంది!
ఎవరి పాపానికి ఎవరు బాధ్యులు?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్