ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందని, క్షేత్ర స్థాయిలో మార్పు వస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గతంలో కొన్ని కుటుంబాలు మాత్రమే అధికారం అనుభవించి పెత్తనం చేశాయని 370 ఆర్టికల్ రద్దుతో అభివృద్ధి ఫలాలు ప్రజలందరికి అందుతాయని అమిత్ షా పేర్కొన్నారు. ఇదివరకు కొందరికే పరిమితమైన అధికారం ఇపుడు సామాన్యులకు కూడా చేరువవుతుందన్నారు.
మూడు రోజుల పర్యటన కోసం షా ఈ రోజు శ్రీనగర్ చేరుకున్నారు. శ్రీనగర్ నుంచి షార్జా కు మొదటి అంతర్జాతీయ విమానాన్ని అమిత్ షా ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అమిత్ షా అంతకు ముందు ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన పోలీసు అధికారి పర్వేజ్ అహ్మద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులని పరామర్శించారు. పర్వేజ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ అపాయింట్మెంట్ లెటర్ అంద చేశారు. ఆ తర్వాత స్థానిక యువతతో సమావేశమయ్యారు. అమిత్ షా వెంట లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి జితేందర్ సింగ్, జమ్మూ కాశ్మీర్ డిజిపి దిల్బాగ్ సింగ్ ఉన్నారు.
370 ఆర్టికల్ రద్దు తర్వాత కేంద్ర హోం మంత్రి మొదటిసారిగా వస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల ఇతర రాష్ట్రాల ప్రజలపై ఉగ్రదాడులు, తీవ్రవాదులని కట్టడి చేసే క్రమంలో పోలీసు ఎన్కౌంటర్ లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోయలో భద్రతపై దేశ ప్రజల్లో మళ్ళీ భయాందోళనలు మొదలయ్యాయి. కాశ్మీర్లో భద్రతకు డోకా లేదని చెప్పేందుకే అమిత్ షా పర్యటన చేపట్టారని సమాచారం.