Sunday, January 19, 2025
HomeTrending NewsAmit Shah: కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు

Amit Shah: కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.50 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు చేరుకొని.. సాయంత్రం 4 గంటల నుంచి 4.30 వరకు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఆస్కార్ విజేతలతో తే నీటి విందులో పాల్గొంటారు. 5.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా చేవెళ్లకు వెళ్లనున్నారు. ఆరు గంటలకు చేవెళ్ల జరిగే విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. సభ అనంతరం పార్లమెంటరీ ప్రవాస్ యోజన సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నారు. రాత్రి 7:45 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.

చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో పాటు పార్టీలో కీలక నేతల చేరికలపై రాష్ట్ర నాయకులు కసరత్తు చేస్తున్నారు. అమిత్ షా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న అనంతరం ఇక్కడికి రానుండటంతో ఆ రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న చేవెళ్ల బహిరంగ సభ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నేతలు నిర్ణయించారు. చేవెళ్లలో విజయ సంకల్ప సభ పేరిట పెద్దఎత్తున బహిరంగ సభ నిర్వహించేలా కార్యక్రమం ఖరారైంది. ఈ నెల 8న హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈ ఏడాదే జరగనున్న నేపథ్యంలో ముఖ్య నేతలు తరచూ రాష్ట్రంలో పర్యటించడంతో పాటు ఇకపై ప్రతినెలా ప్రధాని, హోంమంత్రి పర్యటిస్తారని రాష్ట్రనేతలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో అమిత్ షా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. వివిధ జిల్లాల్లో అసంతృప్త అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యనేతలను బిజెపిలో చేరేలా రాష్ట్ర ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి చేరిక కోసం జాతీయ నాయకత్వం కూడా ప్రత్యేక కసరత్తు చేస్తోంది. దీనిపై రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ముఖ్య నాయకులు అభిప్రాయపడ్డారు. అమిత్ షా సభలోపు ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్