Sunday, September 8, 2024
HomeTrending Newsపౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చట్టంపై అమిత్ షా కీలక ప్రకటన

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చట్టంపై అమిత్ షా కీలక ప్రకటన

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని(CAA)ను లోక్‌స‌భ ఎన్నిక‌ల లోపే అమ‌లు చేస్తామ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం తెలిపారు. ఢిల్లీలో జ‌రిగిన ఈటీ బిజినెస్ స‌మ్మిట్‌లో  పాల్గొన్న ఆయ‌న 2019లో త‌యారు చేసిన సీఏఏ చ‌ట్టాన్ని రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల లోపే దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

సీఏఏ చట్టంపై ముస్లింల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని అమిత్ షా అన్నారు. ఓట్ల కోసం వాళ్ల‌ను రెచ్చ‌గొట్టార‌ని పరోక్షంగా కాంగ్రెస్ ని విమర్శించారు. వేధింపులు త‌ట్టుకోలేక జీవ‌నోపాధి కోసం పాక్‌, ఆఫ్ఘ‌న్‌, బంగ్లా నుంచి భార‌త్‌కు వ‌చ్చిన వారికి పౌర‌సత్వాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ఎవ‌రి భార‌తీయ పౌర‌స‌త్వాన్ని లాక్కోవ‌డం ఆ చ‌ట్టం ఉద్దేశం కాద‌న్నారు.

ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు కూడా రాజ్యాంగ ల‌క్ష్య‌మ‌న్నారు. దేశ తొలి ప్ర‌ధాని నెహ్రూ ఆ పౌర స్మృతి బిల్లుపై చర్చించినా..  కాంగ్రెస్ ఉమ్మ‌డి పౌర స్మృతిని విస్మ‌రించింద‌న్నారు.

ఉత్త‌రాఖండ్‌లో యూసీసీ అమ‌లు చేయ‌డం సామాజిక మార్పు అన్నారు. సెక్యుల‌ర్ దేశంలో మ‌త‌ప‌ర‌మైన పౌర‌స్మృతులు ఉండ‌వ‌న్నారు. అమిత్ షా ప్రకటనతో మరోసారి ఉమ్మడి పౌర స్మృతిపై చర్చ మొదలైంది. ఉత్తరాఖండ్ శాసనసభలో ఆమోదం పొందిన మరుసటి రోజే అమిత్ షా ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.

అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరిస్తుంది. చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది.

పౌరసత్వ సవరణ చట్టం(CAA) బిల్లును తొలిసారిగా 2016 జూలై 09న లోక్‌సభలో… ఆ తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ చట్టం 10 జనవరి 2020 నుండి అమలులోకి వచ్చినప్పటికీ, దాని అమలు కోసం ప్రభుత్వం ఇంకా నిబంధనలను రూపొందించలేదు. దీని ప్రకారము పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ ల నుండి భారత దేశానికి వలస వచ్చే ’ముస్లిమేతరలకు పౌరసత్వము ఇవ్వడానికి ఉద్దేశించింది.

పౌరుల జాబితా(NRC), పౌరసత్వ సవరణ చట్టం(CAA)…  రెండిటికీ సన్నిహిత సంబంధం ఉంది. పౌరుల జాబితాలో చోటుదక్కని, తమ స్వదేశానికి తిప్పిపంపించి వేసే పరిస్థితి ఎదురైతే లేదా నిర్బంధంలో ఉండే పరిస్థితిని ఎదుర్కొంటున్న ముస్లిమేతరులకు పౌరసత్వ సవరణ బిల్లు రక్షణ కల్పిస్తుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్