కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అమిత్‌షా, జగన్‌లకు అర్చకు వేదాశీర్వచనం అందజేశారు. టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి అతిథులకు శ్రీవారి చిత్రపటం,తీర్ధప్రసాదాలు, క్యాలెండర్ అందజేశారు.
అంతకుముందు 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు తిరుపతి విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. డిప్యుటీ సిఎం కె. నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి మేయర్ శిరీష, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డిజిపి గౌతమ్ సావాంగ్ తదితరులు కూడా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. రేణిగుంట నుంచి నేరుగా తిరుమలకు బయల్దేరి వెళ్ళారు.