మనసును కలచివేసే ఎన్నో వార్తల మధ్య ఒక్కోసారి మనసు పులకించే వార్తలు కనిపిస్తుంటాయి. ఎన్నెన్నో సమస్యలు, కన్నీళ్లు కష్టాల మధ్య, ఆరోపణలు- ప్రత్యారోపణల మధ్య, అనేకానేక నెగటివ్ వార్తల మధ్య ఎండిన మోడులు కూడా చిగురించే వార్త ఇది.
వరుసగా ఉన్న మూడు ఫోటోలను చూస్తే చాలు…చెట్టంత వార్త తెలిసిపోతుంది. ఒక ఊళ్లో ఏదో నిర్మాణానికి అడ్డుగా ఉందని పెద్ద రావి చెట్టును నరికేశారు. ఆ ఊళ్లో పర్యావరణ ప్రేమికుడు ఆ నేల కూలిన చెట్టును అదే గ్రామస్థుల సహాయంతో మళ్లీ భూమిలో పాతి, నీరు పోసి…ఆ చెట్టుకు పునర్జన్మనిచ్చాడు.
ఇది చాలా చిన్న వార్తలా అనిపించినా…శాఖోప శాఖలుగా విస్తరించిన పెద్ద వార్త. పోయిన ప్రాణం లేచివచ్చిన వార్త. ఊరికొక్కరికి ఇలాంటి జ్ఞానం ఉన్నా చెట్టు పరవశించి తల ఎత్తుకుని కొమ్మల కోయిలల పాటపాడే వార్త. అతడి కృషి పచ్చగా పదికాలాలు ఇలాగే కొనసాగాలని ఒక ఎం పి అభినందనలతో ప్రోత్సహించాడు కూడా.
ఆ ఊరు సంగారెడ్డి జిల్లా ముక్తాపూర్.
అతడు జ్ఞానేశ్వర్.
అభినందించిన ఎం పి సంతోష్.
వార్త ప్రచురించింది ఈనాడు.
అందరికీ అభినందనలు.