Sunday, January 19, 2025
HomeTrending Newsఅమరావతి-అకోలా రహదారి.. ప్రపంచ రికార్డ్

అమరావతి-అకోలా రహదారి.. ప్రపంచ రికార్డ్

Amravati Akola Road : మహారాష్ట్రలోని అమరావతి-అకోలా జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రపంచ రికార్డ్ సృష్టించాయి. 75 కిలోమీటర్ల మేర రహదారిని కేవలం 105 గంటల ౩౩ నిమిషాల్లో నిర్మించి జాతీయ రహదారుల సంస్థ (NHAI) గిన్నిస్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. శుక్రవారం(జూన్ 3) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పనులు జూన్ 7న సాయంత్రంలోగా పూర్తి చేసి లక్ష్యం సాధించారు. అనుకున్న సమయానికి పూర్తి కావటంతో గిన్నిస్ రికార్డులో చోటు లభించింది. గత 10 ఏళ్లుగా అమరావతి- అకోలా రహదారి గుంతలమయంగా మారి అధ్వాన స్థితిలో ఉండేది. గతంలో ఈ రోడ్డు నిర్మాణ పనులను మూడు సంస్థలకు అప్పగించారు. కానీ, పనులు చేయటంలో జాప్యం చేశారు కాంట్రాక్టర్లు. దీంతో ప్రజలు అమరావతి నుంచి అకోలా చేరుకునేందుకు దర్యాపుర్ రహదారిని వినియోగించేవారు.
అమరావతి-అకోలా దారిలో ప్రయాణించటం చాలా ఇబ్బందితో కూడుకున్న పని. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత దారుణ రహదారిగా పేరు గాంచిన ఈ దారి ఇప్పుడు రికార్డ్ సృష్టించింది. ఈ రోడ్డు పనులను నాలుగు దశల్లో పూర్తి చేశారు. రహదారి నిర్మాణ పనుల్లో జాప్యంపై గతంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ రహదారి పనులను రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థకు అప్పగించింది జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ.
ఒక్కో భాగాన్ని నిర్మించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ మేనేజర్, హైవే ఇంజినీర్, క్వాలిటీ ఇంజినీర్, సర్వేయర్, సెఫ్టీ ఇంజినీర్ సహా మొత్తం 800 మంది ఉద్యోగులు ఇందులో భాగమయ్యారు. పూణే క్యాంప్లో వార్ రూమ్ను ఏర్పాటు చేశారు. అందులో 4 హాట్ మిక్సర్లు, 4 బిల్డర్స్, 1 మొబైల్ ఫీడర్, రోలర్ వంటివి అందుబాటులో ఉంచారు. అత్యాధునిక సాంకేతికతతో రోడ్డు నిర్మించి రికార్డు సృష్టించామని రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ జగదీశ్ కదమ్ వెల్లడించారు. లక్ష్యానికి అనుగుణంగా పనిచేశారని ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టు కంపెనీని కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరి అభినందించారు.
గతంలో ఖతార్లో అత్యంత వేగంగా 22 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఇప్పుడు ఖతార్ రికార్డును అమరావతి-అకోలా రహదారి తిరగరాసింది. 53వ నంబర్ జాతీయ రహదారి పుర్తికావటంతో రాయపూర్, కోల్ కత, నాగపూర్, సూరత్, ముంబై ప్రాంతాలకు రాకపోకలు సులువుకానున్నాయి.

Also Read : కొత్త జిల్లాలు కలుపుతూ జాతీయ రహదార్లు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్