Saturday, September 21, 2024
HomeTrending NewsAmritpal Singh: అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టు

Amritpal Singh: అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టు

సిక్కు వేర్పాటువాది, ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మార్చి 18 నుంచి పరారీలో ఉన్న అతడిని ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్టు పంజాబ్‌ పోలీస్‌ ఐజీ సుఖచైన్‌సింగ్‌ గిల్‌ తెలిపారు. ఒకప్పటి ఖలిస్థాన్‌ ఉద్యమకారుడు, వేర్పాటువాది భింద్రన్‌వాలే సొంత గ్రామం మోగా జిల్లా రోడ్‌లోనే అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టు కావటం గమనార్హం. రోడ్‌లోని గురుద్వారాలో అమృత్‌పాల్‌ ఉన్నట్టు సమాచారం రావటంతో ఆదివారం తెల్లవారుజామునే భారీ సంఖ్యలో పోలీస్‌ బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. గురుద్వారా నుంచి అమృత్‌పాల్‌ తప్పించుకోకుండా నాలుగువైపుల పోలీసులు చుట్టుముట్టడంతో తప్పించుకొనే మార్గం లేకపోయిందని గిల్‌ వెల్లడించారు. అమృత్‌పాలే స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయాడన్న వార్తలను ఆయన ఖండించారు. ‘అతడు లొంగిపోలేదు.. మేమే అరెస్టు చేశాం’ అని స్పష్టం చేశారు. అమృత్‌పాల్‌ను అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైలుకు తరలించారు. అతని అనుచరులు కూడా అదే జైల్లో ఉన్నారు.

అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టుకు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నట్టు సమాచారం. తామే అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్తున్నా.. మరో వాదన కూడా వినిపిస్తున్నది. అమృత్‌పాల్‌ శనివారమే రోడ్‌ గ్రామానికి చేరుకొన్నాడని బింద్రన్‌వాలే సోదరుడు, అకాల్‌తక్త్‌ మాజీ అధిపతి జస్బీర్‌ రోడ్‌ తెలిపారు. ‘సిక్కు సంప్రదాయ దుస్తులు ధరించి శనివారం రాత్రే అతడు గ్రామానికి చేరుకొన్నాడు. ఆదివారం ఉదయం గ్రామంలోని గురుద్వారాలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగించాడు. తాను ఎందుకు పరారీలో ఉండాల్సి వచ్చిందో గ్రామస్తులకు చెప్పాడు. ఆ తర్వాత గురుద్వారా బయటకు వెళ్లగానే పోలీసులు అరెస్టు చేశారు’ అని వెల్లడించారు. పోలీస్‌ ఐజీ గిల్‌ మాత్రం తప్పించుకొనే మార్గం లేకనే గురుద్వారా నుంచి అమృత్‌పాల్‌ బయటకు వచ్చాడని చెప్పారు. అమృత్‌పాల్‌ ఎక్కడ ఉన్నాడో తెలిసినా.. సిక్కులకు పరమ పవిత్రమైన గురుద్వారా లోపలికి పోలీసులు వెళ్లకుండా సంయమనం పాటించారని తెలిపారు. అరెస్టు సమయంలో స్థానికులు కూడా ఎలాంటి నిరసన తెలుపకుండా పోలీసులకు సహకరించారని పేర్కొన్నారు. అమృత్‌పాల్‌ అరెస్టుపై పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ స్పందించారు. సమాజంలో అలజడి సృష్టించాలని ప్రయత్నించినవారు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టంచేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరుడిని అరెస్టు చేశారు. అతడిని విడిపించుకొనేందుకు వేలమందితో కలిసివచ్చిన అమృత్‌పాల్‌.. పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశాడు. తల్వార్లు, తుపాకులతో భయోత్పాతం సృష్టించి తన అనుచరుడిని విడిపించుకొని వెళ్లాడు. దీంతో అతడిపేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఘటన తర్వాత అతడి కార్యకలాపాలపై దృష్టిపెట్టిన పంజాబ్‌ ప్రభుత్వం, కేంద్ర ఇంటెలిజెన్స్‌ సంస్థలు.. అమృత్‌పాల్‌కు పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించాయి. పాకిస్థాన్‌ నుంచి ఆయుధాలు కూడా సేకరించినట్టు తేలింది. దీంతో అతన్ని అరెస్టు చేయటానికి పంజాబ్‌ పోలీసులు ప్రయత్నించటంతో మార్చి 18 నుంచి అమృత్‌పాల్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మారువేషాలతో తిరుగుతున్నాడని, దేశం విడిచి పారిపోయాడని అనేక వదంతులు వచ్చినప్పటికీ ఒకప్పటి ఉగ్రవాది జర్నైల్‌సింగ్‌ బింద్రన్‌వాలే స్వగ్రామంలోనే అతడు పోలీసులకు పట్టుబడటం విశేషం. అమృత్‌పాల్‌పై అత్యంత కఠినమైన జాతీయ భద్రతా (ఎన్‌ఎస్‌ఏ) చట్టంతోపాటు 16 రకాల కేసులు నమోదయ్యాయి. ఎన్‌ఎస్‌ఏ కింద కేసు నమోదైతే ఏడాదిపాటు ఎలాంటి విచారణ లేకుండానే దేశంలోని ఏ జైల్లో అయినా నిర్బంధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. డిబ్రూగఢ్‌ జైల్లో ఉన్న 8 మంది అమృత్‌పాల్‌ అనుచరులపై కూడా ఎన్‌ఎస్‌ఏ కింద కేసులు నమోదయ్యాయి.

అమృత్‌పాల్‌ సింగ్‌ భార్య కిరణ్‌దీప్‌కౌర్‌ గత గురువారం లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎయిర్‌పోర్టులో గుర్తించి అడ్డుకున్నారు. ఆమెపై పోలీసులు నిఘా పెట్టడం అమృత్‌పాల్‌ను కలవరపెట్టిందని సమాచారం. అమృత్‌పాల్‌ నిధులను మళ్లించి లండన్‌లో దాచాడని, కిరణ్‌దీప్‌ అరెస్టు అయితే ఈ విషయం బయటపడుతుందనే ఆందోళన కూడా అతడిలో ఉందని పోలీసులు భావిస్తున్నారు. కిరణ్‌దీప్‌కౌర్‌ యూకే పౌరురాలు. ఆమె 180 రోజుల వీసాపై భారత్‌లో ఉన్నారు. జూలైలో ఆమె వీసా గడువు ముగిసేలోగా ఆమె యూకే వెళ్లాల్సి ఉన్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్