అమెరికాలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ ను అధిగమించి ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. గత వారం సీడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం, డెల్టా కేసులు 27 శాతానికి పడిపోగా, ఒమిక్రాన్ కేసులు 73 శాతానికి పెరిగాయి. గత వారం రోజుల వ్యవధిలో ఒమిక్రాన్ కేసులు సగటున రోజుకు 1,90,000 నమోదయ్యాయి.
మరోవైపు న్యూయార్క్ లో ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కోవిడ్ సంబంధిత కేసులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఈ నెల 5న ప్రారంభమై ప్రస్తుత వారం వరకు ఆసుపత్రుల్లో చేరిన 18 ఏళ్ల లోపు వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. వీరిలో దాదాపు సగం మంది ఐదు సంవత్సరాలలోపు వారే ఉండటం గమనార్హం. ఐదేళ్ల లోపు వారు టీకా తీసుకునేందుకు అర్హులు కాదని న్యూయార్క్ స్టేట్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ తెలిపింది.
అటు గ్రీసులో ఒకరోజే 40 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 77 మంది చనిపోయారు. రష్యా లో 20 వేల పైచిలుకు కేసులు వెలుగు చూడగా 220 మంది చనిపోయారు. కెనడాలో ఒక రోజే 41 వేల కేసులు వెలుగు చూడటం ఆ దేశ ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది.
ప్రపంచ దేశాల మధ్య ఉన్న అంతరాలు తొలిగిస్తేనే కరోనా లాంటి మహామ్మారులు తగ్గిపోతాయని, కోవిడ్ ఇబ్బందులు నియంత్రించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టేద్రోస్ అధనోం ఘెబ్రేఎసుస్ ప్రకటించారు. విద్య, వైద్య పరంగా వెనుకబడిన దేశాల ప్రజలను ఆడుకోపోతే మరిన్ని విపత్తులు వస్తాయని టేద్రోస్ అన్నారు.