Friday, October 18, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబసవనేని ట్రావెల్స్

బసవనేని ట్రావెల్స్

Weight Less: బండి బరువు ఎడ్ల మెడ మీద పడకుండా కాడి మధ్యలో ఒక టైరు అమర్చిన చిత్రం ఒకటి సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. అది నిజం కావచ్చు, ఫేక్ కావచ్చు…కానీ ఐడియా బాగుంది అని లోకం అనుకుంది. ఈలోపు మహారాష్ట్రలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆ ఆలోచనను నిజం చేశారు. వారి ఇంజనీరింగ్ చదువు కొనసాగింపుగా “సారథి” పేరిట ఎడ్ల మీద బరువును తగ్గించే “థర్డ్ సపోర్టింగ్ రోలర్” ను తయారు చేసి…పరీక్షించారు. ప్రయోగం విజయవంతమయ్యింది. గొడ్డు చాకిరి నుండి గొడ్లకు విముక్తి కలిగించాలన్న ఈ సాంకేతిక విద్యార్థుల ప్రయోగం గొప్పది. వారి మనసు ఇంకా గొప్పది.

Bullocks

ధర్మానికి ఎద్దు ప్రతిరూపం. అందుకే శివుడు ఎద్దు మీద తిరుగుతూ ఉంటాడు. ధర్మం నాలుగు పాదాలతో నడవడం అన్న మాట ఇక్కడి నుండే పుట్టింది. ఇదివరకు యుగాల్లో ధర్మం నాలుగు పాదాలతో నడిచేది కాబట్టి సపోర్టింగ్ రోలర్ అవసరం అయి ఉండదు. కలిలో ధర్మం ఎన్ని పాదాలతో నడుస్తుందో చెప్పాల్సిన పనిలేదు. అందుకే సపోర్టింగ్ రోలర్లు ఆవిష్కారమవుతున్నాయేమో?

ఎడ్ల బండ్లు రెండురకాలు . ఒకటి పెద్ద చెక్క చక్రాలతో ఉన్నది . రెండోది టైరు చక్రాలతో ఉన్నది . చెక్క చక్రాల బండి సాధారణం . టైరు బండి సంపన్న వ్యవసాయదారులకే పరిమితం. రోల్సు రాయిస్ లాంటిది. వోల్వో మల్టీ యాక్సిల్ బస్సులాగా కాస్త లోలెవెల్. కానీ చెక్క చక్రాల ఎడ్ల బండి అందం , గాంభీర్యం , దాని నడక , హొయలు , ఆ బండిమీద వేరుశెనగ పంట కొండలాగా పేర్చి , ముందు తలపాగా చుట్టి , చేత చెర్నాకోల పట్టి , లేపాక్షి బసవడి అంత జోడెడ్లను చల్ . . . డుర్రుర్ . . అని నాలుకమడతపెట్టి ఇతరులుపలకలేని సంకేత భాషలో తోలే రైతును చూడని కళ్లు కళ్లేకాదు .

ఈ ఎడ్లబండ్లు వరుసగా వెళ్లే కాన్వాయ్ ని చూడగలిగే అదృష్టమే అదృష్టం. అదికూడా ఒక చెరువు కట్టమీద దారి అయి…ఒక వైపు నీళ్లు , ఒక వైపు పొలాలు మధ్యలో ఎడ్లబండ్ల వరుసను చూడగలిగితే ముక్కోటితీర్థాల్లో ముక్కోటిసార్లు మునిగినపుణ్యమే.

ఉదయాన్నే ఎడ్లకు మేత పెట్టడం రాకెట్ సైన్సుకంటే పెద్దవిద్య . బండి కాడెను కింద దించి వెనుకభాగంలో ఒద్దికగా కూర్చోవాలి . మేతను రెండు ఎడ్లకు వాటంగా అమర్చుకోవాలి . ఎడ్ల నోటి దగ్గర పెట్టాక అవితింటుంటే కొద్దికొద్దిగా లోపలికి అందివ్వాలి . గట్టిగా తోయకూడదు , అలాగని గట్టిగా పట్టుకోకూడదు . మేత అయిపోయేలోపు నిరంతరాయంగా అందివ్వాలి . తరువాత కాసేపు విశ్రాంతి ఇవ్వాలి . ఎడ్లు హాయిగా నాలుగు కాళ్ళు మడిచి అచ్చం లేపాక్షి బసవడిలానే కూర్చుంటాయి . అప్పుడవి నెమరువేసుకుంటాయి . అర్ధ నిమీలిత నేత్రాలతో తమలోతాము బ్రహ్మానందమనుభవించే మునుల్లా ఎడ్లు నెమరువేస్తూ అలౌకిక స్థితిలో ఉన్నప్పుడు చూస్తే గోహత్యా పాతకం కూడా మరుక్షణంలో మాయమవుతుందేమో! తరువాత నాలుగు బిందెల కుడితి తాగి ఎడ్లు నిలుచుని సకల భువన భారాన్ని ఇప్పుడుపెట్టండి నామూపుమీద అని సవాలు విసురుతాయి .

ఎద్దు మెదడులో ఎన్ని జి పి ఎస్ లు ఉన్నాయో , ఎన్ని సెల్ఫ్ కంట్రోల్డ్ డైనమిక్ మెకానిక్స్ ఉన్నాయో తెలియదు . అందరూ హార్స్ పవర్ అంటూ గుర్రాన్ని ఆకాశానికెత్తారు కానీ….ఎద్దుపవర్ అని ఈ శక్తి సాంకేతిక టెర్మినాలజీని తిరగరాయాలి. హరప్పా మొహంజదారో లిపిలో ఉన్నది కూడా ముద్దులొలికే పెద్ద కొమ్ముల ఎద్దే .

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

పశుపాలన

RELATED ARTICLES

Most Popular

న్యూస్