Sunday, January 5, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరూ. 22కోట్ల చేతి వాచీలో కాలమెలా కదులుతుందో!

రూ. 22కోట్ల చేతి వాచీలో కాలమెలా కదులుతుందో!

కోడి కూస్తే తెలవారుతుందని గుర్తు. కొమ్మల్లో పక్షులు రెక్కలల్లారుస్తూ కిలకిలారావాలు చేస్తే సూర్యుడొస్తున్నాడని సంకేతం. తూరుపు కొండల్లో బంగారు, నారింజ, ఎరుపు రంగులు వచ్చాయంటే సూర్యుడు వచ్చేసినట్లే. పొద్దు పొడిచినట్లే. లేలేత కిరణాలతో లోకాలను సూర్యుడు తట్టి లేపినట్లే. సూర్యుడు నడినెత్తిన ఉంటే మిట్ట మధ్యాహ్నం. పడమటి కొండల్లో మళ్లీ బంగారు రంగు పులుముకున్నాడంటే సాయంత్రమయినట్లే. పగటి దీపం వెలుగు తగ్గిందంటే రాత్రి దగ్గరవుతున్నట్లు. చిమ్మ చీకటి ముసురుకుందంటే బాగా రాత్రయినట్లు. ఆకాశంలో చంద్రుడి స్థానాన్ని బట్టి ఎంత రాత్రయ్యిందో చెప్పేవారు. ఇదంతా మొరటు పద్ధతి. గోడలకు గడియారాలు వచ్చాయి. చేతికి గడియారాలు వచ్చాయి. సెల్ ఫోన్లు వచ్చాక కెమెరాలు, క్యాలిక్యులేటర్లు, రేడియోలు, డెస్క్ టాపులు మాయమయినట్లే గడియారాలు కూడా మాయమయ్యాయి. చేతిలో సెల్ ఉంటే అన్నీ ఉన్నట్లే… మనం సెల్లులో బందీ అయినట్లే. ఇప్పుడు సెల్లు లేకపోతే మన బతుకు బతుకే కాదు. సెల్లు లేని ఇల్లు ఇల్లే కాదు. ఇదివరకు ఇంటిని చూసి ఇల్లాలిని చూడమనేవారు. ఇప్పుడు సెల్లును చూసి ఆ మనిషిని చూడమంటున్నారు.

ఇదివరకు కాబోయే అల్లుడు ఆగర్భ దరిద్రుడై ఉండేవాడు కాబట్టి ఉంగరం, రిస్ట్ వాచీ, గోచీ, సైకిలు లాంటి అతి సంపన్నుల వస్తువులను కట్నంలో కానుకలుగా అడిగేవారు. వీటి కోసం కాబోయే మామ ఆరు నెలలపాటు మూడు చెరువుల నీళ్లు తాగేవాడు. స్వయం ప్రకాశం లేని కా. అల్లుడు మామగారి ప్రకాశంతో కొన్నాళ్లయినా వెలిగేవాడు. తరువాత అల్లుడు పాతబడి, అమ్మాయి కొంగుబట్టుకుని తిరిగేప్పుడు అదే అత్తా మామలే అల్లుడిలో స్వయం ప్రకాశం లేని విషయాన్ని స్వయంగా పూసగుచ్చినట్లు అల్లుడికే వివరించేవారు. అల్లుడు కూడా తలదించుకుని మర్యాదగా అంగీకరించేవాడు. అది వేరే విషయం. కట్నంలో రిస్ట్ వాచీ వస్తుందన్న ఒకే ఒక ఆశతో ఎందరో పురుషోత్తములు కనీసం పాతికేళ్లపాటు చేతికి వాచీ లేకుండా బతికేసిన కాలాలు ఉండేవి.

వెయ్యి రూపాయలు పెడితే మామూలు చేతి గడియారం దొరుకుతుంది. నాలుగయిదు వేలు పెడితే ఒక మోస్తరు వాచీ వస్తుంది. పది వేలు పెడితే మేలిమి రకం చేతి గడియారం వస్తుంది. పేదల, మధ్య తరగతి చేతి గడియారాలకు ఇంతకు మించి సీన్ ఉండదు. అదే సంపన్నుల చేతి గడియారాలయితే లక్ష నుండి పాతిక కోట్ల రూపాయలదాకా ఎంతైనా ఉంటాయి.

అన్నమయ్య అన్నట్లు హంసతూలికా తల్పం మీద మహారాజు నిద్ర ఒకటే- పక్కనే కింద కటిక నేల మీద బంటు నిద్ర ఒకటే. అలాగే వజ్రాల వాచీ ఏడు గంటలు అని నవ్వదు. వెయ్యి రూపాయల వాచీ ఏడు గంటలు అని ఏడవదు. లేదా ముష్టి వాచీలో సమయం ఏడయినప్పుడు…వజ్రాల వాచీలో సమయం ఆరో లేక ఎనిమిదో కానే కాదు. ఎందులో అయినా ఒకే సమయం కదా అని అనుకోకూడదు. సంపన్నులది విలువయిన సమయం. నిరుపేదలది విలువలేని సమయం. మనిషికి విలువ లేనప్పుడు…వాచితో విలువ పెరిగితే అతని/ఆమె టైమ్ బాగున్నట్లే అనుకోవాలి. మరీ లక్షల/కోట్ల విలువైన వాచీ పెట్టుకున్నవారు వంశీ సినిమాల్లోలా వాచీకి ప్రైస్ ట్యాగ్ కూడా తగిలించుకుని తిరిగితే తప్ప…టైమ్ బాగలేని సామాన్యులకు దాని విలువ తెలిసే అవకాశం ఉండదు. లేదా సమయం, సందర్భం లేకుండా ఆ గొప్ప వాచీ పెట్టుకున్నవారే అడగనివారినందరినీ పిలిచి మరీ దాని అదిరిపోయే రేటు, గుణగణాల గురించి చెప్పనైనా చెప్పాలి.

సంపన్నులు టైమ్ ను కొంటారు.
టైమ్ చూసి కొంటారు.
టైమ్ తో కొడతారు.
టైమ్ తెలియకుండా కొంటారు.
వారి టైమింగ్ ను, వారి టైమ్ సెన్స్ ను అభినందించడం తప్ప మనం చేయగలిగింది లేదు.
వారిది రిచ్ టైమ్ కావచ్చు కానీ…మనది పూర్ టైమ్ మాత్రం కాదు. బ్యాడ్ టైమ్ అసలే కాదు. దేనికయినా టైమ్ రావాలి-అంతే!

అన్నట్లు-
ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానాల్లో ఉండే రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ చేతిని అలంకరించిన వాచీ ధర మన కరెన్సీలో అక్షరాలా 22కోట్ల రూపాయలేనట. రిచర్డ్ మిల్లే కంపెనీ తయారు చేసిన ఈ వాచీలు ప్రపంచంలో మూడంటే మూడే ఉన్నాయట. అందులో ఒకటి మన భారతీయుడి చేతిలో మెరుస్తుండడం భారతీయులుగా మనకెంత గర్వకారణం! ఎంత ఇది! ఎంత అది!!

“ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబానలమెంతో?
ఆ నల్లని ఆకాశంలో కానరాని
భాస్కరులెందరో?

అణగారిన అగ్ని పర్వతం కనిపెంచిన లావా ఎంతో?
ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో?

అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో!
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో?”

అని దాశరథులు వజ్రం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఇలాంటి రిచర్డ్ మిల్లే వాచీల కాలాలను చూడలేకే…

బాంబే అరేబియా సముద్రాన్ని చూస్తూ…ఆ సముద్రంలో దాగిన బడబాగ్నులకు అక్షరరూపమిచ్చి ఉంటారు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్