బుల్లితెరకి గ్లామర్ టచ్ ఇచ్చిన అనసూయ, ఆ తరువాత వెండితెరపైకి వచ్చింది. ఆరంభంలో ఐటమ్ సాంగ్స్ లో మాత్రమే మెరవాలనుకున్న అనసూయ, ఆ తరువాత కాలంలో ముఖ్యమైన పాత్రకి ఐటమ్ తోడై ఉండాలనే కండిషన్ పెడుతూ వెళ్లింది. కాస్త కుదురుకున్న తరువాత ఐటమ్ సాంగ్స్ పక్కన పెట్టేసి, కీలకమైన పాత్రలపై మాత్రమే దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో అనసూయ చేసిన నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు ఆమెకి మరింత మంచి పేరును తెచ్చిపెట్టాయి.
‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’ .. ‘పుష్ప’ సినిమాలో ‘దాక్షాయణి’ పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తరువాత ‘కిలాడీ’లో చంద్రకళ రోల్ చేసినా, ఆ సినిమా ఫ్లాప్ కావడం వలన అనసూయ పడిన కష్టానికి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ‘మైఖేల్’లో చేసిన ‘చారులత’ పాత్ర అయినా ఆమెను గురించి మరోసారి మాట్లాడుకునేలా చేస్తుందనుకుంటే, ఆ పాత్ర కూడా ఆమె అభిమానులను నిరాశ పరిచింది.
‘మైఖేల్’ ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాలో అనసూయ .. గౌతమ్ మీనన్ పోషించిన గురునాథ్ పాత్రకి భార్యగా నటించింది. మాఫియా డాన్ అయిన తన భర్తకి ఎంతమంది స్త్రీలతో ఎలాటి సంబంధాలున్నా, తన కడుపునా పుట్టినవాడు మాత్రమే వారసుడుగా ఉండాలనే కసితో కూడుకున్న పాత్ర ఇది. ఈ పాత్రలో తెరపై అనసూయ పరిచయమైనప్పుడు ఆడియన్స్ ఆ పాత్ర నుంచి చాలా ఆశిస్తారు.
కానీ ‘చారులత’ పాత్రను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వలన, కాసేపు హడావిడి చేసి చప్పున చల్లారిపోతుంది. ఆ పాత్రలో లుక్ పరంగా ఆమెకి మంచి మార్కులు పడతాయి. కానీ పాత్ర పరంగా ఆమె విజృంభించే అవకాశం లేకుండా చేశారు. అవకాశాము ఉన్నప్పటికీ దర్శకుడు ఆమెను ఉపయోగించుకోలేకపోయాడని అనిపిస్తుంది. అలా కాకుండా ఆమె పాత్రను సరిగ్గా మలిచి ఉంటే, ఆయనే ఎంట్రీ ఇచ్చిన దగ్గరా నుంచి సినిమా మరింత ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళ్లేదని అనిపించకమానదు.
Also Read : సందీప్ కిషన్ యాక్షన్ డోస్ కాస్త తగ్గిస్తే బాగుండేదేమో!