మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి. అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపిగా బరిలోకి దించాలని సిఎం జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓసీ అభ్యర్ధులే ఉండడంతో లోక్ సభ సీటును బిసిలకు కేటాయించాలని సిఎం భావిస్తున్నారు. అందువల్లనే నరసరావుపేటనుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న లావు శ్రీకృష్ణ దేవరాయలును గుంటూరు నుంచి పోటీ చేయాలని కోరడం, దానికి విముఖత వ్యక్తం చేసిన లావు గత వారం ఎంపి పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసిన సంగతి విదితమే.
అయితే తొలుత ఈ స్థానం నుంచి యువనేత, విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్ధ ఛైర్మన్ నాగార్జున యాదవ్ ను పోటీ చేయిస్తారని అనుకున్నా చివరకు అనిల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేశారని సమాచారం. ఈ లోక్ సభ పరిధిలో బిసి ఓట్ల సంఖ్య అధికంగా ఉండడం…. ఇటీవల పార్టీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో అనిల్ పాల్గొన్న సందర్భంగా కార్యకర్తలు, బిసి వర్గాల నుంచి ఆయనకు అపూర్వ ఆదరణ లభించింది. ఈ దృష్ట్యా అనిల్ అయితే బలమైన అభ్యర్ధి అవుతారని జగన్ బావిస్తున్నారు.
మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ షాక్ ఇచ్చింది,. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేసింది. ఎమ్మిగనూరుకు ఇప్పటికే ప్రకటించిన అభ్యర్ధి స్థానంలో బుట్టా రేణుకకు అవకాశం ఇస్తున్నారు. ఈ రెండు స్థానాలను ఐదో జాబితాలో అధికారికంగా ప్రకటించనున్చేనారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు గుమ్మనూరు జయరాం నిరాకరించడంతో పాటు అధిష్టానానికి అందుబాటులోకి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.