అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ 28న విడుదలైంది కానీ.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో అక్కినేని అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో దర్శకుడిపై విమర్శలు చేశారు. రెండో రోజు నుంచే కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. ఇంత తక్కువ కలెక్షన్లా అని సినీ జనాలు షాక్ అయ్యారంటే బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
ఈ సినిమాపై నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ వైరల్ అయ్యింది. తెర మీద కంటే ఆన్ లైన్ లోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘సరైన బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టామని, మధ్యలో కరోనా లాంటి ఇతర కారణాలు ప్రభావితం చేయడం వల్ల ఎంతో ఎత్తులో ఉన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని’ అన్నారు. ఇకపై ఇలా జరగకుండా ఖచ్చితమైన ప్లానింగ్ తో ముందుకెళ్తామని, ఎలాంటి సాకులు వెతకడం లేదని.. దీనికి తానే బాధ్యత వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది ఇండస్ట్రీ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక అగ్ర నిర్మాత సినిమా నాలుగో రోజు ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే ఇలా బహిరంగంగా తప్పుని ఒప్పేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇలా స్పందించడంలో అనిల్ నిజాయతీ కనిపిస్తుంది. ఖరీదైన పాఠం నేర్చుకున్నామని.. ఇలాంటి పొరపాట్లు ఇక పై చేయమని, ఏజెంట్ ను, తమ నిర్మాణ సంస్థను నమ్ముకున్న వాళ్ళందరూ క్షమించాలని కోరారు. నష్టాల భర్తీకి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో మరింత కష్టపడతామని క్లారిటీ ఇచ్చారు.