1929 జూన్ 12 – అన్నే ఫ్రాంక్ (Anne Frank) జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో జన్మించారు. ఆమె 15 ఏళ్ళకే మరణిం చారు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నరకయాతన అనుభవించిన యూదులలో ఆమె ఒకరు.
అయితే ఆమె రాసిన ఓ డైరీ “అన్నే ఫ్రాంక్ డైరీ” గా ప్రపంచ ప్రసిద్ధి పొందింది.
యూదులు అనుభవించిన వేధింపులకు సాక్ష్యం ఈ డైరీ. దీని ఆధారంగా ఎన్నో నాటకాలూ సినిమాలూ వచ్చాయి.
ఆమె పదమూడవ పుట్టినరోజుకి ఓ డైరీని కానుకగా ఇచ్చారు. అందులో ఆమె 12 జూన్ 1942 నుండి 1 ఆగస్టు 1944 వరకు తన జీవితం గురించి రాసుకుంది.
1945 ఫిబ్రవరిలో ఆమె మరణానంతరం ఈ డైరీ ముద్రితమైంది. ఈ డైరీ విశేష ప్రాచుర్యం పొందింది. అయితే ఇటీవల ఈ డైరీ అన్నే ఫ్రాంక్ కి ఓ ఉత్తరం రాసినట్టు ఓ ఊహాజనిత రచనను తమిళంలో చదివాను. అది ఎవరు రాసారో తెలీలేదు. కానీ చదువుతుంటే నాకెంతగానో నచ్చింది. అయినప్పటికీ నేను కొన్ని మార్పులూ చేర్పులూ చేసాను.
ప్రియమైన ఆన్నే ఫ్రాంక్…
నేను నీ డైరీని. మామూలుగా అయితే నువ్వు రాస్తావు. అది నీకున్న అలవాటు. నువ్వు రాస్తుంటే నేను వాటిని నేను గ్రహించే దానిని. ఇప్పుడు నా వంతు వచ్చింది. నేను నీతో నా మనసుని చెప్పాలనిపించింది. నేను రాస్తున్న ఈ ఉత్తరాన్ని నువ్వు చదివి కోపగించుకోవని నాకు తెలుసు. ఎందుకంటే నేను నీ సఖిని కదా. పైగా నీకసలు కోపమంటే ఏమిటో అస్సలు తెలీదుగా. నువ్వు నాతో మొట్టమొదటగా మాట్లాడిన
విషయాలను నేను తరచూ గుర్తు చేసుకునే దానిని.
“నేనీ రోజు నీతో నా గురించి రహస్యాలన్నింటినీ పంచుకోబోతున్నాను.
ఇంకెవరితోనూ చెప్పని ఈ రహస్యాలను నీతో పంచుకోవడానికి కారణమేమిటో తెలుసా? నీ మీద నాకు ఉన్న నమ్మకం అలాటిది. నేను చెప్పే మాటలను నువ్వు ఇంకెవరికీ చెప్పవని నాకు తెలుసు. నువ్వంటే నాకెంతో ఇష్టం. ఇంకా చెప్పాలంటే ప్రేమనుకో.
నేనెక్కడ అక్షరజ్ఞానం పొందానని అడుగుతున్నావా? నువ్వు జర్మనీలో పుట్టి నెదర్లాండులో పెరిగావు. నేను పుట్టింది నెదర్లాండులోనే.
ఒక పెద్ద దుకాణంలో ఐనేకానేక పుస్తకాలతో నన్ను కలిపేసారు. పైగా నా భుజానికి మరో బరువైన పుస్తకాన్ని పెట్టారు. అస్సలు గాలి ఆడలేదనుకో. ఉక్కిరిబిక్కిరయ్యాను. ఒళ్ళంతా నొప్పులనుకో. ఇంతకీ నా పక్కనున్న భారీ పుస్తకంలో ఏముందాని పేజీలు తిరగేశాను. ఆ పుస్తక రచయిత అడాల్ఫ్ హిట్లర్. కఠినమైన భాష. క్రూరమైన మాటలు. అయినా మొత్తం చదివాను.
యూదుల గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. తేదీ బాగా గుర్తుంది.
నేనొక డైరీని కదా. 12 జూన్ 1942. ఉదయం ఆరు గంటలకల్లా నువ్వు నిద్ర లేచేసావు. నీకోసం రకరకాల కానుకలు నిరీక్షించాయి. కొత్త దుస్తులతో ఎంత బాగున్నావో చూడటానికి. బొమ్మలు. చాక్లెట్లు. పుస్తకాలు. ఆ తర్వాత నేను. మేమందరం నీకోసం నిరీక్షిస్తున్నాం. నువ్వు
మేడ మీద నుంచి మెట్లు దిగి మేమున్న చోటుకి వచ్చావు.
నీకోసం చూస్తున్న కానుకలన్నింటినీ కళ్ళతోనే చూశావు. నువ్వు నన్ను చూస్తావా చూడవా అని అనుకుంటున్న సమయంలో నువ్వు నన్నూ చూశావు. చూడటమే కాదు, నన్నే మొట్టమొదటగా తీసుకున్నావు నీ మృదువైన చేతులతో. ఆశతో నాకో ముద్దు ఇచ్చావు. రాయడం మొదలుపెట్టావు. ఎంత అందంగా ఉంటాయో నీ అక్షరాలు. నీలాగే అవికూడా మృదువైనవి. నీ భావాలెంతగా నన్ను ఆకట్టుకున్నాయో….
అందరూ మంచివారే.
అందరినీ ప్రేమాస్పదులే.
ప్రేమించాలి. ప్రేమను నిండు హృదయంతో స్వచ్ఛంగా పంచాలి.
దుష్టులలోనూ ఒకింత ప్రేమ ఉండే ఉంటుందని రాసావొక రోజు.
ఇంకొక రోజు, ఈ ప్రపంచంలో బలమైన ఆయుధం మృదుత్వమే అని రాశావు. దాంతో అందరినీ గెలవచ్చు అన్నావు.
హిట్లర్ దగ్గర ద్వేషం మాత్రమే ఉంది. దానినే అందరికీ ప్రదానం చేశారు.
నీదగ్గరేమో ప్రేమ మాత్రమే ఉంది. ఆ ప్రేమనే అందరికీ హాయిగా పంచావు.
మంచివారినైనా ద్వేషించూ అన్నారు హిట్లర్.
శత్రువులనైనా ప్రేమించు అన్నావు నువ్వు.
మనుషులను విభజించడానికి ఇష్టపడ్డారు హిట్లరు.
నువ్వేమో అందరినీ కలపాలనుకున్నావు.
హిట్లరుకి శత్రుత్వమూ పోరూ ముఖ్యం.
నీకేమో శాంతీ సంతోషమూ ముఖ్యం.
చివరికి ఏమైందో తెలుసా?
ప్రపంచమంతా గడగడలాడి నియంతగా అన్పించుకున్న హిట్లర్ ఓడిపోయాడు.
ఆయన ద్వేషం నశించింది.
కానీ నువ్విప్పటికీ చిరంజీవివై ఉన్నావు
నీ ఉన్నతమైన భావాలతో.
నీ ప్రేమ ఏ రోజుకారోజు వృద్ధి చెందుతోంది.
నీ భావాలన్నీ నీ మనసుకి అద్దంపట్టాయి. నాకెంతో నచ్చాయి.
అప్పటిదాకా వొట్టి తెల్ల కాగితాలై ఉన్న నన్ను నీ సున్నితమైన మాటలతో మరింత అందాన్ని నాకిచ్చావు. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను ఆరాధిస్తున్నాను.
ఇట్లు
నీ ప్రేమాభిమాని
డైరీ
– యామిజాల జగదీశ్