Saturday, January 18, 2025
HomeసినిమాAgent: ఆకట్టుకోలేకపోయిన ఆకతాయి 'ఏజెంట్'

Agent: ఆకట్టుకోలేకపోయిన ఆకతాయి ‘ఏజెంట్’

Mini Review: మొదటి నుంచి కూడా సినిమాకి .. సినిమాకిఅఖిల్ గ్యాప్ ఎక్కువ తీసుకుంటూ వస్తున్నాడు. కారణమేదైనా ఆయన నుంచి అభిమానులు ఆశిస్తున్నంత వేగంగా సినిమాలు రావడం లేదు. అదే పద్ధతిలో ఆయన తాజా చిత్రంగా ‘ఏజెంట్’ నిన్న థియేటర్లకు వచ్చింది. అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాతోనే ముంబై బ్యూటీ సాక్షి వైద్య టాలీవుడ్ కి పరిచయమైంది. గతంలో కొన్ని హిట్స్ ఇచ్చిన సురేందర్ రెడ్డి – వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది.

వక్కంతం వంశీ కథల్లో యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. హీరో పాత్రను ఆయన డిజైన్ చేసుకునే తీరు అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంటుంది. ఇక ఆ కథలను సమర్థవంతంగా చిత్రీకరించడంలో సురేందర్ రెడ్డి సక్సెస్ అవుతూ వచ్చాడు. అందువలన ఈ కాంబినేషన్ పై గల నమ్మకంతో కూడా ఆడియన్స్ ఉన్నారు. ఇక తాను చేసిన ఈ సినిమా కొత్త జోనర్లో ఉంటుందనీ, ఆల్రెడీ అందరూ చేసేసిన కథలను చేస్తే తన స్పెషాలిటీ ఏవుంటుందని ప్రమోషన్స్ లో అఖిల్ అన్నాడు.

దాంతో మొత్తానికి అంతా కలిసి కొత్తగా ఏదో చేశారనే విషయం మాత్రం జనాలకు అర్థమైంది. అందుకు తగినట్టుగానే రిలీజ్ రోజున థియేటర్స్  దగ్గర బాగానే సందడి కనిపించింది. కానీ తీరా  సినిమా మొదలయ్యాక ఆశలు ఆవిరైపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఒక ఆకతాయిని ‘రా’ చీఫ్ ఎంపిక చేసి, అత్థి పెద్ద ఆపరేషన్ ను అప్పగించడాన్ని ఆడియన్స్ జీర్ణించుకోలేక నానా అవస్థ పడ్డారు. కథ .. స్క్రీన్ ప్లే .. పాటలు ..  పాత్రలను డిజైన్ చేసిన విధానం  ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగించింది. సురేందర్ రెడ్డి మార్క్ ఎంతమాత్రం కనిపించని ఈ సినిమాలో, నిర్మాణ విలువలు .. ముమ్ముట్టి నటన .. ఫొటోగ్రఫీకి మాత్రం  మంచి మార్కులు పడతాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్