(ప్రత్యేక వ్యాసం)
జింకను వేటాడడానికి పులి ఎంత ఓపికగా వుంటుందో తెలుసా.. మరి పులినే వేటాడాలంటే..?
అతడు సినిమా లో డైలాగ్ గుర్తుంది కదా..
ఒకరు చెప్పేది నమ్మి జనాలు మారరు.
ఒక ప్రెస్ మీట్ తో పాలిటిక్స్ తారుమారు కావు..
మీకు రాజేందర్ మీద ప్రేమో.. నమ్మకం వున్నాయనుకోండి..
ఆయన భూఆక్రమణల వ్యవహారం పెద్ద విషయం కాదు..
మీరు కేసిఆర్ వైపు వున్నారనుకో్ండి..
ఆయన అహంకారం అసలు విషయమేకాదు.. .
కేసిఆర్ ను వదిలి నేతలు వెళ్ళిపోవడం ఈరోజు కొత్తేం కాదు.
పార్టీ నాదే అని చెప్పుకునే ఇన్నారెడ్డి నుంచి
అంతరంగికుడు కపిల వాయి దిలీపు వరకు..
టైగర్ ఆలె నరేంద్ర నుంచి….
వీర విజయశాంతి వరకు..
అందరిదీ అవమానాల చరిత్రే..
అందరికీ కేసిఆర్ అహంకారం అనుభవమే..
అందరూ ఖబడ్దార్ కేసి ఆర్ అని రంకెలేసిన వాళ్లే ..
మరి రాజేందర్ కొత్తగా చెప్పిందేంటి..
తెలంగాణా లో కొత్తగా జరిగేదేంటి,,
మహా అయితే, బిజెపి కి ఒక ఎమ్మెల్యే పెరుగుతాడు.
..
అహంకారం గురించి,
అవమానాల గురించి,
కుటుంబ పాలన గురించి,
డబ్బు, అవినీతి గురించి
ఈటల ఏం చెప్పినా.. టీఆర్ ఎస్ డిఫెన్స్ ఒకటే..
“మరి ఇన్నాళ్లూ ఎందుకున్నావు?”
ఈ ప్రశ్నకే ఈటల దగ్గర సరైన సమాధానం వుండదు.
బయటికొచ్చేసాక ఆరోపణలు చేయడం ఒక కాలం చెల్లిన విద్య.
ఈ విద్యతో కే సిఆర్ ని , టీ ఆర్ ఎస్ ని ఎవరూ ఏమీ చేయలేరు.
నిజంగా ఏమైనా చేయాలంటే,
తెలంగాణా రాజకీయాల్లో తలకిందులు అయ్యే మార్పు రావాలంటే..
మళ్లీ ఒక కేసి ఆర్ రావాలి.
అతను టీ ఆర్ ఎస్ నుంచే పుట్టాలి.
..
కారణం..వ్యక్తిగతస్వార్ధమే కావచ్చు.,
కోపం.. తనకు మంత్రిపదవి రాలేదనే కావచ్చు..
కానీ, కేసి ఆర్ రూటు పూర్తిగా సెపరేటు..
కేవలం చంద్రబాబును దించడమో..,
మళ్లీ మంత్రి పదవి సాధించడమో కేసి ఆర్ లక్ష్యాలు కావు…
ఒక ప్రత్యామ్నాయ రాజకీయాన్ని నిర్మించడం
ఒక పార్టీని ప్రతిష్టించడం..
ఒక రాష్ట్రాన్ని సాధించడం..
ఇదీ ఆనాడు కే సి ఆర్ వేసుకున్న దారి..
ఇవన్నీ క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు కాలేవు.
కేవలం ప్రతీకారంతో పెట్టుకునే లక్ష్యాలు కావు.
ఒక ఎన్నికలతోనో, ఒక పదవి తోనో చేరే గమ్యాలు కావు..
చాలా ఓపికగా, శ్రద్ధగా
గులాబితోటకి అంటుకట్టాడు ..
రెండు ప్రాంతాల మధ్య కనిపించని గోడ కట్టాడు
తన ప్రాంత ప్రజలకు ఒక కలని ఇచ్చాడు.
అది తానే నెరవేర్చాడు.
తాను ఏలడానికి తానే ఒక రాష్ట్రాన్ని సృష్టించుకున్నాడు.
చంద్రబాబు ని రాజకీయంగా తెలంగాణ నుంచి తరిమేసాడు.
..
యుద్ధమంటే ఇలా చేయాలి..
గెలవడమంటే ఇలా గెలవాలి
ప్రతీకారం అంటే ఇలా తీర్చుకోవాలి
ఇవన్నీ మరోసారి సాధ్యం కావాలంటే..
కేసి ఆర్ ను మించిన మరో కేసి ఆర్ రావాలి.
వ్యూహం లో వేగం
ఆచరణలో ఓర్పు
గమ్యం మీద గురి
మార్గం మీద స్పష్టత వున్నవాడు రావాలి…
అది రాజేంద్రల వల్ల నరేంద్రల వల్ల కాదని తేలిపోయింది.
తర్వాత ఎవరి వంతో చూడాలి.
-కె. శివప్రసాద్