For Fun: నాని హీరోగా ‘అంటే .. సుందరానికీ’ సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతోనే టాలీవుడ్ కి నజ్రియా పరిచయమవుతోంది. ఒక బ్రాహ్మణ యువకుడికీ … క్రిస్టియన్ యువతికి మధ్య జరిగే ప్రేమ ప్రయాణం .. ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలే ఈ సినిమా కథ. ఈ రోజునే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. నరేశ్ .. నదియా .. రోహిణి .. హర్షవర్ధన్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, ప్రత్యేకమైన పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తుంది.
సుందరం (నాని) ఒక బ్రాహ్మణ యువకుడు .. ఎన్నో కలలు .. ఆశలు .. ఆశయాలు ఉంటాయి. అయితే ఆచారవ్యవహారాల పేరుతో అతని కుటుంబ సభ్యులు ఊరుదాటనివ్వరు. ఇక క్రిష్టియన్ కుటుంబానికి చెందిన థామస్ వేరే కులానికి చెందిన యువకుడికి తన పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేసి ఇబ్బంది పడుతుంటాడు. రెండో కూతురైన లీలా థామస్ (నజ్రియా)కి మాత్రం తమ కులానికి చెందిన కుర్రాడితోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే సుందరం – లీల ప్రేమలో పడతారు .. పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకుంటారు.
తన కారణంగా లీల గర్భవతి అయినట్టుగా ఆమె ఇంట్లో తెలిసేలా చేసిన సుందరం, ఇక వాళ్లు ఆమెను తనకే కట్టబెడతారని ఆశిస్తాడు. తనకి సంతానం కలిగే అవకాశం లేదనీ, అయినా తనని పెళ్లి చేసుకోవడానికి లీల ఒప్పుకుందని తన పేరెంట్స్ ను నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవడానికి రెండు కుటుంబాల పెద్దలు రంగంలోకి దిగడంతోనే కావలసినంత కామెడీకి అవకాశం ఏర్పడుతుంది. వివేక్ ఆత్రేయ అక్కడక్కడా ఎమోషన్ ను టచ్ చేస్తూ .. కామెడీని కనెక్ట్ చేస్తూ ముందుకు వెళ్లాడు.
నాని – నజ్రియా ప్రేమ చుట్టూనే కథ తిరుగుతుంది. కానీ ఇద్దరి మధ్య రొమాన్స్ ను గురించిన ఆలోచనే వివేక్ ఆత్రేయ చేయలేదు. అలాగే ఒక్క డ్యూయెట్ కూడా లేకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. సందర్భాన్ని బట్టి వచ్చే పాటలు ఉన్నప్పటికీ, అవి ఆడియన్స్ పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఫస్టాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను కాస్త లాగినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్ లో మాత్రం కథ పుంజుకుంటుంది. దర్శకుడు ప్రతి పాత్రను మలిచినతీరు .. క్లిష్టమైన అంశాన్ని సున్నితంగా చెప్పిన విధానం అభినందించదగినవిగా అనిపిస్తాయి. ఆసక్తికరమైన కథనం .. ఆశించిన స్థాయిలో లభించే కామెడీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.
Also Read : నజ్రియాకి టాలీవుడ్ నచ్చేసినట్టే!