కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు జీ20 సమావేశాల సందర్భంగా అవమానం జరిగిందని ఆ దేశ పత్రికలూ…అక్కడి ప్రతి పక్షాలూ గగ్గోలు పెడుతున్నాయి. భారత్ ను నేరుగా విమర్శించ లేక ట్రూడో పేరుతో భారత్ ను అవమానించేందుకు కెనడా మీడియా సాయ శక్తులా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు విపక్షాలు వంతపాడుతున్నాయి. కెనడా ప్రధానిని పదేపదే అవమానించడాన్ని ఎవరూ ఇష్టపడరని ఆ దేశ ప్రతిపక్ష నేత పియర్ పోయిలీవ్రే ఎక్స్‌లో పోస్టు చేశారు. రాజ్‌ఘాట్ సందర్శన సందర్భంగా ట్రూడోకు షేక్‌హ్యాండ్ ఇచ్చిన మోదీ.. ముందుకు వెళ్లమని సైగ చేశారని పేర్కొంటూ ‘ది టోరంటో సన్’ అనే కెనడా వార్తాపత్రిక ఈనెల 10న కథనం ఇచ్చింది.
ట్రూడో భారత్‌లో ల్యాండ్ అయిన సమయంలో ఆయన్ను స్వాగతిస్తూ ‘వెల్‌కమ్ నోట్’ పోస్టు చేయలేదని కొందరు కెనడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. మోదీ, ట్రూడో మధ్య జరిగిన సమావేశంలో కెనడాలో జరుగుతున్న ఖలిస్థానీ ఆందోళనల పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ కఠినంగా, విమర్శనాత్మకంగా మాట్లాడారని పేర్కొంటున్నారు.
కెనడా ప్రధానమంత్రిగా జస్టిన్ ట్రూడో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భారత్ – కెనడా మధ్య సంబంధాలు రెండు అడుగులు ముందుకు… నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. 2015 లో ప్రధాని అయ్యాక ఆయన మంత్రివర్గంలోకి రికార్డు స్థాయిలో ఐదుగురు సిక్కులను తీసుకున్నారు. దీనిపై భారత ప్రభుత్వం సహా భారతీయులు ఆనందం వ్యక్తం చేశారు.
అయితే ఇక్కడి నుంచే చిక్కులు మొదలయ్యాయి. మంత్రివర్గంలోని సిక్కు మంత్రులు…పార్లమెంటు సభ్యులుగా ఉన్న సిక్కులు భారత్ ను విమర్శించటం…ఖలిస్తాన్ వేర్పాటువాదానికి మద్దతు తెలపటం ఆందోళన కలిగించే అంశం.
ఇటీవల వరుసగా కెనడాలోని వివిధ ప్రాంతాల్లో భారత వ్యతిరేక శక్తులు బహిరంగంగా వేర్పాటువాదాన్ని సమర్థిస్తున్నాయి. కెనడాలో హిందూ దేవాలయాల మీద ఖలిస్తాన్ వేర్పాటువాదులు పిచ్చి రాతలు రాసినపుడు ఆ దేశ మీడియా…విపక్షాలు మొక్కుబడిగా నిరసన వ్యక్తం చేశాయి.
టొరంటోలోని ప్రఖ్యాత స్వామి నారాయణ ఆలయం గోడలపై హిందూ వ్యతిరేక రాతలకు ఖలిస్తానీలు పాల్పడ్డారు. స్వామి నారాయణ్ గుడి ఘటనపై కెనడా ఎంపి చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. స్వామి నారాయణ్ గుడి ఉన్న ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపి సోనియా సిద్దు ఘటనపై సీరియస్ అయ్యారు.
కెనడా విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసానికి అనుమతి పొంది విసా రాకపోవటంతో వేల మంది భారత విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యూషన్ ఫీజులు కాలేజీలకు చెల్లించిన విద్యార్థులు వీసా కోసం పడిగాపులు కాస్తున్నారు. సుమారు 2,30,000 మంది భారత విద్యార్థులు కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళగా.. వారంతా వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్య అబ్యాసిస్తున్నారు. వీరి నుంచి సుమారు నాలుగు బిలియన్ డాలర్లు కెనడాకు ఆదాయం సమకూరింది.
ఈ వ్యవహారాలపై కెనడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవటంలో విఫలం అయింది. భారత్ ఆందోళనలపై సరిగా స్పందించ లేదనే ఆరోపణలు ఉన్నాయి.
భారత ప్రభుత్వం ‘వాంటెడ్ టెర్రరిస్ట్’ గా ప్రకటించిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (46) ఈ ఏడాది జూన్ లో బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రీ పట్టణంలో హత్యకు గురయ్యాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో హర్దీప్ మరణించాడు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ సభ్యులకు కార్యకలాపాల నిర్వహణ, నెట్ వర్క్ ఏర్పాటు చేయడం, శిక్షణ, ఆర్థిక సహకారం వంటివి హర్దీప్ చేస్తుంటాడు. హర్దీప్ సింగ్ కు సిక్ ఫర్ జస్టిస్ సంస్థతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ ఘటనతో భారత్ వ్యతిరేక ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
భారత దేశంలో రైతాంగం చేసిన ఆందోళనలకు ప్రధాని ట్రూడో మద్దతు తెలిపారు. కెనడాలో సిక్కులను ప్రసన్నం చేసుకునేందుకే ట్రూడో మద్దతు తెలిపారని…ట్రూడో వ్యాఖ్యలపై అప్పట్లో భారత్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది.
ఇలా ట్రూడో మొదటి నుంచి భారత్ విషయంలో నిర్లిప్తంగానే వ్యవహరిస్తున్నారు. జీ20 సమావేశాల్లో అమెరికా దగ్గర నుంచి దక్షిణ అమెరికా వరకు అందరు దేశాధినేతలకు కేంద్ర మంత్రులే స్వాగతం పలికారు. అదే కోవలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ .. కెనడా ప్రధానికి స్వాగతం పలికారు. కెనడా విమానానికి సాంకేతిక లోపం రావటంతో భారత ప్రభుత్వం ట్రూడోను వారి దేశానికి తరలించేందుకు భారత అధికారిక విమానం ఎయిర్ ఇండియా వన్ సేవలను అందిస్తామని చెప్పింది. కానీ అందుకు కెనడా ప్రధాని ఒప్పుకొలేదు. ఎయిర్ ఇండియా వన్ సేవలను ఇండియా 1 అని కూడా పిలుస్తారు. ఇది భారత వైమానిక దళంచే నిర్వహించబడుతుంది. ఇది ప్రధానంగా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి కోసం మాత్రమే ఉపయోగిస్తారు. కానీ అలాంటి విలువైన సేవలను సైతం కెనడా ప్రధాని స్వీకరించలేదు.
ఆ క్రమంలో కెనడా నుంచి వచ్చే మరో విమానం కూడా పలు కారణాలతో లండన్ కు మళ్లీంచారు. ఇక్కడకు వచ్చిన మొదటి ఫ్లైట్ రిపేర్ కావడంతో ఆయన వారి దేశానికి చేరుకున్నారు. అయితే జీ20 సదస్సు సందర్భంగా పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించిన మోదీ.. ట్రూడోతో ఒక్కసారి కూడా సమావేశాలు నిర్వహించలేదు. కెనడాలో భారత వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాల గురించి పీఎం మోడీ తన వాదనలను వినిపించారు. అలాంటివి ఎదుర్కోవడంలో రెండు దేశాలు సహకరించడం చాలా అవసరమని గుర్తు చేశారు. ఈ అంశంపై ట్రూడో స్పందిస్తూ కెనడా ఎల్లప్పుడూ “భావ ప్రకటనా స్వేచ్ఛ”ను కాపాడుతుందన్నారు. అదే సమయంలో హింసను నిరోధించడానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఇలా మొక్కుబడి ప్రకటనలు తప్పితే…ఆచరణలో ఎక్కడా చిత్తశుద్ది లేదు.
సుమారు 15 లక్షలకు పైగా భారతీయులు కెనడాలో నివసిస్తున్నారు. ఆ దేశ జనాభాలో ఇది మూడు శాతం కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికైనా భారత్ పట్ల కెనడా ప్రధాని ట్రూడో తన నిర్లిప్త వైఖరి వీడనాడాలి. అదే విధంగా ఖలిస్తాన్ వేర్పాటువాదులను కట్టడి చేయాలి.
దశాబ్దాలుగా ఎప్పుడు లేనిది ట్రూడో హయంలో భారత వ్యతిరేకత కెనడాలో పెరుగుతోంది. భారత ప్రభుత్వం…భారతీయులు కెనడా ప్రభుత్వ విధానాల పట్ల… సిక్కుల దుందుడుకు వైఖరి తదితర అంశాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.