Saturday, January 18, 2025
Homeసినిమాబిగి సడలని అనుకోని అతిథి

బిగి సడలని అనుకోని అతిథి

(మావీ రివ్యూ)

ప్రేమ చిత్రాలంటే… సహజంగా ఓ నాల్గు డ్యూయెట్లు… హీరో, హీరోయిన్ల మధ్య సాగే పరిచయ సన్నివేశాలు.. కలిసి తిరగటాలు.. పెద్దలు ఒప్పుకోకపోవటాలు… ఆ మధ్యలో వచ్చిపడే సమస్యలు.. చివరాఖరకు వాటిని పరిష్కరించి అయితే సుఖాంతమో… లేకపోతే కొన్ని కథలు దుఖాంతమవ్వడమో రొటీన్ ప్యాటర్న్. కానీ చివరాఖరి వరకూ ప్రేమ సంగతే బయటపడకుండా… థ్రిల్లర్ కమ్ సస్పెన్స్ తో… అప్పుడప్పుడూ హార్రర్ ను తలపిస్తూ బిగిని సడలకుండా సినిమా నడిపిస్తే అదే మళయాళ “అథిరన్”… తెలుగులో “అనుకోని అతిథి”.

ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నప్పుడు అనుమానిత పాత్రలదే కీలకపాత్ర. అలాంటి క్రమంలో సినిమాలో ఫలానావాళ్లే విలన్ క్యారెక్టరై ఉండొచ్చన్న ప్రేక్షకుల అంచనాలకూ చాలా సినిమాల్లో పాత్రలందుతుంటాయి. కానీ ఏ పాత్రకాపాత్రే సస్పెక్టివ్ గా చివరివరకూ సాగితే అదే “అనుకోని అతిథి.”

ఎక్కడో ఊరికి దూరంగా అడవిలో ఓ పిచ్చాసుపత్రి నడిపించే డాక్టర్ బెంజమిన్ . ఆసుపత్రి తనిఖీకి వచ్చే సైక్రియాటిస్ట్ కిషోర్ నందా. అక్కడేదో జరుగుతున్న అనుమానంతో నందాకూ… డాక్టర్ బెంజమిన్ కు, ఆయనకు సహకరించే సిబ్బందికి మధ్య ఎప్పుడు చూసినా కనిపించే వైరుధ్యం. అందుకు తగ్గట్టే డాక్టర్ బెంజమిన్ వ్యవహారశైలి… ఆసుపత్రిపై ఆది నుంచీ అనుమానంతోనే అడుగుపెట్టిన నందా వ్యతిరేకంగా నివేదిక ఇచ్చేందుకు పడే తంటాలు.. నందాను లేపేసేందుకు డాక్టర్ బెంజమిన్ యత్నాలు… ఆ క్రమంలోనే ఓ జైలు లాంటి చీకటిగదిలో కనిపించే నిత్య.. ఆమె గురించి నందా ఆరా తీసే క్రమం… ఇలా సాగుతుంది మొత్తంగా సినిమా. మిగతా వివరాలు సినిమా చూస్తేనేగానీ.. ఆ థ్రిల్లర్ వాచ్ అనుభూతి పొందలేం.

అసలు అనుకోని అతిథి అని ఎందుకు ఆ సినిమాకు పెట్టాల్సి వచ్చిందో మళయాళ మెస్మరైజ్డ్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ చెబుతుంది. ఆ క్యారెక్టర్ కూ.. సినిమాలో ప్రేమ అనే కాన్సెప్టుకూ ఏం సంబంధమో చివరాఖరకుగానీ తెలియనంత సస్పెన్స్ థ్రిల్లర్ ను దర్శకుడు వివేక్ నడిపించిన తీరు… చిన్న అంశాన్ని పట్టుకుని కథనాన్ని ఎంత బాగా నడిపించొచ్చో అప్ కమింగ్ డైరెక్టర్స్ కి ఈ సినిమా పట్టిచూపిస్తుంది. పైగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు… అనూ మోతేదత్ థర్డ్ ఐ ఈ సినిమాను నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించిందని చెప్పవచ్చు. అంతేకాదు ఆరారు రుతువుల్లో ఆమని నువ్వేనా అంటూ రాసిన పాటలు కూడా నేరుగా తెలుగులో విడుదలయ్యే ఎన్నో పాటలకంటే రచనాపరంగా.. మెలోడియస్ గా కూడా నప్పేలా ఉంటాయి.

మానసిక రోగి నిత్య పాత్రలో సాయిపల్లవి నటనొకవైపు… విభిన్న చిత్రాలతో వేటికదే ప్రత్యేకమైన జానర్స్ తో దూసుకెళ్తూ ఇవాళ అద్భుతమైన నటుల్లో ఒకడైపోయిన ఫహాద్ ఫాజిల్ నటన ఇంకొకవైపు పోటీపడి విరగదీసిన సినిమా అనుకోని అతిథి. డాక్టర్ బెంజమిన్ పాత్రలో అతుల్ కులకర్ణితో పాటు… సినిమాలోని ప్రతీ పాత్రా తనకంటూ ఒక ప్రత్యేకతను కల్గి ఉండటం… అంతే ప్రత్యేకంగా ఆయా నటులు నటించడం మనకు ఈ సినిమాలో కనిపిస్తుంది. అయితే చివరాఖరగా వచ్చే వెర్సటైల్ నటుడు ప్రకాష్ రాజ్ పాత్ర పోషణలో ఎలాంటి వంక లేకపోయినా… అంత గొప్ప నటుణ్ని సినిమాకు అలా ముక్తాయింపుగా వాడుకోవడమే కొంత వెలితిని మిగులుస్తుంది. కానీ అదే.. దర్శకుడి భిన్న ఆలోచనకు ఓ ప్రతిరూపమనుకోవచ్చునేమో!

ఏదేమైనా అనుకోని అతిథి అద్భుతమైన నిర్మాణ విలువలున్న బిగి సడలని సస్పెన్స్ థ్రిల్లర్.

-రమణ కొంటికర్ల

RELATED ARTICLES

Most Popular

న్యూస్