నవరత్నాలు అమలు కాలేదని చెప్పడానికి నోరెలా వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. అబద్ధం చెప్పొచ్చు కానీ దానికో హద్దుండాలని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వేదికగా దీనిపై చర్చించేందుకు రావాలని, అక్కడ తాము చేసినవి చెప్పి మిమ్మల్ని తోమి పంపిస్తామని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. ఇంకా ఎక్కైడైనా ఎవరో ఒకరికి సంక్షేమం అందకపోతే వారికి కూడా పథకాలు అందించడం కోసమే జగనన్న సురక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. సంక్షేమం తో పాటు ధృవీకరణ పతకాలు కూడా వెంటనే అందించడమే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు.
చంద్రబాబు పెద్ద అబద్దాల కోరు అని, ఆయన తన జీవితంలో ఎప్పుడూ నిజాలు చెప్పలేదని మంత్రి దుయ్యబట్టారు, చంద్రబాబుకు ఇంగ్లీష్ లో సరిగా మాట్లాడడం రాదని .. వచ్చిన కొద్ది దాంట్లోనే ఆయన ఓటుకు నోటు సమయంలో స్టీఫెన్ సన్ తో మాట్లాడారని ఎద్దేవా చేశారు. బాబు సిఎం కాకముందే సత్య నాదెళ్ళ మైక్రో సాఫ్ట్ లో చేరారన్నారు. మన పిల్లలకు ఇంగ్లీష్ సరిగా మాట్లాడాలని తపించే ముఖ్యమంత్రి సిఎం జగన్ కాబట్టి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారని కాకాణి చెప్పారు.
డ్రిప్ ఇరిగేషన్ పై లోకేష్ ఓ సెల్ఫీ విడుదల చేస్తూ అవాస్తవాలు మాట్లాడారని, బాబు ప్రభుత్వం 800 కోట్ల 16 లక్షల రూపాయలు బకాయి పెట్టారని …తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ బాకీలు తీర్చడంతో పాటు 1289.69 కోట్లు బిందు సేద్యానికి ఖర్చు చేశామని… ఈ గణాంకాలపై ఏవైనా సందేహాలుంటే.. ఆయన తండ్రి చంద్రబాబు స్వీకరించి చర్చకు రావాలని సవాల్ చేశారు. బిందు సేద్యంలో తమకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయని, బాబు హయంలో ఎపుడైనా వచ్చాయా అని నిలదీశారు. దేశవ్యాప్తంగా బిందు సేద్యం బాగా అమలు చేస్తున్న పది జిల్లాల్లో నాలుగు ఏపీ నుంచే ఉన్నాయని చెప్పారు.