Tuesday, September 17, 2024
HomeTrending Newsఅక్టోబర్ 7న మత్స్యకార గర్జన: సోము

అక్టోబర్ 7న మత్స్యకార గర్జన: సోము

మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసేలా ఉన్న జీవో 217పై రాష్ట్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ జీవో వివాదాస్పదంగా ఉందని, మత్స్యకారుల సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందని పేర్కొన్నారు. వారి కులవృత్తి, జీవన విధానం చిన్నాభిన్నంగా మారుతుందని అయన ఆందోళన వ్యక్తం చేశారు. తాము గతంలో దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇంతవరకూ స్పందన లేదని చెప్పారు.

ఈ జీవోకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్మిస్తామని, ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న నెల్లూరు జిల్లా నుంచే తమ ఆందోళన మొదలుపెడతామని చెప్పారు. అక్టోబర్ 7న నెల్లూరులో మత్స్యకార గర్జన నిర్వహిస్తున్నామని, దీనికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి మురుగన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మత్స్యకారుల ఆదాయం పెంచేలా కేంద్రప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ప్రకటించిందని, వీటి ద్వారా వచ్చే నిధులు రాష్ట్రంలో ఎలా ఖర్చుపెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చేనేత ఉత్సవాన్ని జరుపుతామని, విశాఖలో చేనేత ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తామని వీర్రాజు వెల్లడించారు. 216, 216-ఏ జాతీయ రహదారులను కలుపుతూ, అమలాపురం నుంచి రావులపాలెం వరకూ జాతీయ రహదారిని కేంద్రం విస్తరిస్తోందని సోము గుర్తుచేశారు. రోడ్ల విషయంలో రాష్ట్రం తమ బాధ్యతను విస్మరించిందని విమర్శించారు. రోడ్ల మరమ్మతుల కోసం ఇటీవల రాష్ట్రం రూ. 2 వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిస్తే ఒక్కరూ రాలేదని, రెండేళ్లలో కేంద్రం ఏపీలో 25 వేల కోట్ల రూపాయలతో రహదారులు నిర్మించామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్