Saturday, January 18, 2025
HomeTrending Newsపోలవరం చూసి కన్నీళ్లు వచ్చాయి: చంద్రబాబు

పోలవరం చూసి కన్నీళ్లు వచ్చాయి: చంద్రబాబు

రాష్ట్రం పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో నేడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు, సాగునీటి ప్రాజెక్టులపై విడిగా మరో శ్వేతపత్రం వెల్లడిస్తామని చెప్పారు. పోలవరం కోసం గతంలో తాము పడిన శ్రమను ఐదేళ్ళలో జగన్ వృథా చేశారని, అర్హత లేనివారికి అధికారం వస్తే ఇలాంటి అరాచకాలే జరుగుతాయని, కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉందో తెలియనివారు మాపై విమర్శలు చేశారని మండిపడ్డారు.

పోలవరాన్ని ఎంతకాలంలో బాగు చేస్తామో నిపుణులే తేల్చాలని, పోలవరంలో తప్పులు చేసిన అధికారులను మారుస్తున్నామని, ఈ ప్రాజెక్టును విధ్వంసం చేసిన ప్రధాన దోషిని జనం ఇంటికి పంపారని వ్యాఖ్యానించారు.  పోలవరం ఎత్తు విషయంలో రాజీ లేదని, ఇటీవల ఆ ప్రాజెక్టును చూసి కళ్ల వెంట నీళ్లు వచ్చాయని ఆవేదన వెలిబుచ్చారు. ప్రాజెక్టుపై త్వరలోనే మేధావులు, నిపుణులతో సహా అందరి సలహాలు తీసుకుంటామన్నారు.

సీఎం చంద్రబాబు మాట్లాడిన ముఖ్యాంశాలు

  • రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరం, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం
  • ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి నినాదంతో ఎన్నికలకు వెళ్లాం
  • ప్రజలు గెలిచారు.. ఇక రాష్ట్రాన్ని నిలబెట్టాలి
  • కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలి
  • 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది
  • ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం,  వెబ్ సైట్ల ద్వారా ఈ పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతాం
  • దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే శ్వేతపత్రాల విడుదల
  • పోలవరంపై మొదటి శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం
  • సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేతపత్రం ఉంటుంది
  • రాష్ట్రానికి పోలవరం, అమరావతి రెండు కళ్లు – పోలవరాన్ని జగన్ నాశనం చేశారు
  • పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహం
  • రాష్ట్ర అభివృద్ధికి జలవిద్యుత్ కీలకం
  • విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టం ఎక్కువ
  • ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయ రంగానికి ఊతం వస్తుంది
  • 2014-19 మధ్య పోలవరానికి రూ.11,762 కోట్లు ఖర్చు చేశాం
  • వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది
  • జగన్ మూర్ఖత్వంవల్ల ఓ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది
  • జగన్ ప్రమాణం చేస్తూనే పోలవరం పనులు ఆపేశారు – ప్రత్యామ్నాయం లేకుండానే కాంట్రాక్టర్లను తొలగించారు
  • సమర్థులైన అధికారులను బదిలీ చేశారు, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని హైదరాబాద్‍ ఐఐటీ బృందం చెప్పింది
  • డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం జగన్‍కు రెండేళ్ల తర్వాత తెలిసింది
  • 2019 ఆగస్టు 16న సీఎస్‍కు పీపీఏ లేఖ రాసింది – ఏజెన్సీలను మార్చవద్దని పీపీఏ స్పష్టంగా చెప్పింది
  • పీపీఏ హెచ్చరికలను జగన్ పెడచెవిన పెట్టారు
  • 2009లోనూ వైఎస్ కాంట్రాక్టర్‍ను మార్చారు, అప్పుడు హెడ్ వర్క్స్ నిలిచాయి
  • వైఎస్ చేసిన తప్పే జగన్ కూడా చేశారు
  • నీతిఆయోగ్ బృందం నాటి సర్కారు తప్పిదాలను ఎత్తిచూపింది
  • కాఫర్‍ డ్యామ్ గ్యాప్‍లు పూర్తిచేసేటప్పుడు ఏజెన్సీని మార్చారు
  • 2018లో డయాఫ్రమ్‍ వాల్‍ను రూ.436 కోట్లతో పూర్తిచేశాం
  • ఇప్పుడు డయాఫ్రమ్‍వాల్ మరమ్మతులకే రూ.447 కోట్లు ఖర్చయ్యింది
  • కొత్త డయాఫ్రమ్‍వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతుంది, కనీసం 2 సీజన్లు పడుతుంది
  • కాఫర్ డ్యామ్ సీపేజ్ వల్ల ఏ పనులూ చేసే పరిస్థితి లేదు
  • జగన్ విధ్వంసంతో ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులు మారాయి
  • జగన్ ప్రభుత్వ అసమర్థతతో గైడ్‍బండ్ కుంగిపోయింది
  • రూ.80 కోట్లతో నిర్మించిన గైడ్‍బండ్ నిరుపయోగంగా మారింది
  • టీడీపీ హయాంలో పోలవరం 72 శాతం పూర్తయింది
  • వైసీపీ హయాంలో 3.84 శాతం పనులే జరిగాయి
  • పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.3,385 కోట్లు మళ్లించారు
  • టీడీపీ హయాంలో ప్రశంసలు దక్కాయి – వైసీపీ హయాంలో పీపీఏ, ఐఐటీ నిపుణుల చివాట్లు దక్కాయి
  • పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారు
  • పోలవరం మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నిపుణులను రప్పిస్తున్నాం, వారు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారు
  • ఏజెన్సీని మార్చకపోతే 2020 నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేది
  • జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.4,900 కోట్ల నష్టం జరిగింది.; ఖర్చు 38 శాతం పెరిగింది
  • పైగా విద్యుత్ ఉత్పత్తి కోల్పోయాం. దీని ద్వారా మరో రూ.3 వేల కోట్లు నష్టపోయాం
  • పోలవరం ఆలస్యంతో రైతులకు రూ.45 వేల కోట్లు నష్టం జరిగింది
  • అంతర్జాతీయ, దేశీయ నిపుణుల సాయంతో సమస్యను పరిష్కరిస్తాం
  • కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో సవాళ్లు అధిగమిస్తాం
  • ప్రాజెక్టు కట్టడం కంటే మరమ్మతు ఇంకా కష్టమైన పని
  • ప్రాజెక్టుపై ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి, మేధావులు కూడా ఏం చేయాలో సలహా ఇవ్వాలి
RELATED ARTICLES

Most Popular

న్యూస్