AP cm Jagan Review On Health And Medical Department :
వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం ఇప్పటికే నిధులు విడుదల చేశామని, కాబట్టి పనులు త్వరగా, నాణ్యతతో పూర్తయ్యేలా చూడాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 8585 చోట్ల పనులు మొదలయ్యాయని అధికారులు సిఎంకు వివరించారు. పీహెచ్‌సీల్లో నాడు – నేడు కార్యక్రమాలు జరుగుతున్నాయని, డిసెంబర్ నాటికి మరమ్మతు పనులు పూర్తవుతాయని తెలిపారు.
16 కొత్త మెడికల్‌కాలేజీ పనుల పురోగతిని కూడా సిఎం సమీక్షించారు. ఇప్పటికే నాలుగు చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల నిర్మాణాలకు సన్నాహాలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల, విశాఖజిల్లా అనకాపల్లి మెడికల్ కాలేజీ స్థలాలపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యయని అధికారులు సిఎం దృష్టికి తీసుకురాగా కేసులు త్వరగా పరిష్కరించేలా చూడాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
గతంలో వైయస్సార్ కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకోలేని వారికి మరోసారి అవకాశం కల్పించాలని కంటి సమస్యలు గుర్తించిన వారికి కళ్లజోడు ఇవ్వాలని, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు చేయించాలని..దీనికోసం ఒక వారంరోజులపాటు డ్రైవ్ నిర్వహించాలని నిర్దేశించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్స్ కు, 104కు అనుసంధానంచేసి నిరంతర ప్రక్రియగా కొనసాగించాలన్నారు ముఖ్యమంత్రి.
ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జి ఎస్ నవీన్ కుమార్, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవియన్ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read : ముఖ్య అంశాలపై నివేదిక: సిఎం