వైఎస్సార్ జిల్లా జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు నేడు భూమిపూజ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 8,800కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్లాంట్ లో 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి కానుంది. తొలి విడతలో 3,300 కోట్లతో 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనున్నారు.
కడప స్టీల్ ప్లాంట్ అనేది ఎన్నాల్లుగానే ఈ ప్రాంత ప్రజలు కన్న కల అని సిఎం జగన్ అభివర్ణించారు. ఒక స్టీల్ ప్లాంట్ అనేది వస్తే జిల్లా మొత్తం అభివృద్ధి అయ్యే వీలుందన్నారు. గత పాలకులు ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారని, తాను సిఎం అయిన తరువాత పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేశామని, దీనిలో భాగంగానే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా జరుగుతోందన్నారు. ఒక మంచి వ్యక్తి చేతుల్లోకి ఈ స్టీల్ ప్లాంట్ వెళ్ళడం ఒక మంచి పరిణామమని చెప్పారు. 28.5 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో లక్షా 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ స్టీల్ ప్లాంట్ రంగంలో పెట్టారని కితాబిచారు. ఇక్కడ ఏర్పాటు చేస్తోన్న ఈ ప్లాంట్ నిర్మాణం 3 మిలియన్ టన్నులతోనే ఆగిపోదని, 13 టన్నుల వరకూ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్లాంట్ కోసం ఇక్కడ మిగిలి ఉన్న భూములన్నీ రూ.40 కోట్లతో కొనుగోలు చేసి.. దాదాపు 3,500 ఎకరాలు జిందాల్ ఫ్యాక్టరీకి కేటాయించి, దాదాపు రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఏడున్నర కిలోమీటర్ల మేరకు నాలుగు లైన్ల రోడ్డు వేస్తున్నామని, ప్రొద్దుటూరు, ఎర్రగుంట రైల్వే లైను కొరకు కొత్తగా మరో పదికిలోమీటర్లు లైన్ నిర్మాణం కూడా జరుగుతోందని…. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిసరఫరా కోసం ప్రత్యేక పైపులైన్ ద్వారా అందించే కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. నిరంతరంగా విద్యుత్ సరఫరా కోసం తలమంచిపల్లె సబ్‌స్టేషన్ నుంచి ఈ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా 220 కేవీ లైన్ కూడా నిర్మిస్తున్నామని, ఈ రకమైన మౌలిక సదుపాయాలు ఈ ప్లాంట్‌కు అందించేందుకే దాదాపు రూ.700 కోట్లు మనం ఖర్చు చేస్తున్నామని సిఎం జగన్ తెలిపారు.
దివంగత నేత వైఎస్సార్ తనకు మంచి మిత్రుడు, గురువు అన్ని సజ్జన్ జిందాన్ చెప్పారు. సిఎం జగన్ తనకు ఎప్పటినుంచో తెలుసన్నారు. నేడు వేసింది ఫౌండేషన్ స్టోన్ మాత్రమే కాదని, వైఎస్సార్ జిలా అభివృద్ధికి కూడా పునాదిరాయి వేసినట్లేనని భరోసా ఇచ్చారు. ఇండియా మ్యాప్ లో ఇది స్టీల్ జిల్లాగా అందరికీ తెలుసనీ పేర్కొన్నారు. బళ్ళారి, ఒరిస్సాలో తాము చేపట్టిన ప్రాజెక్టులు కూడా విజయపథంలో నడుస్తున్నాయని చెప్పారు. ఇక్కడ కూఒడా ఓ మోడల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, గ్రీన్ ప్లాంట్ గా ఉంటుందని ప్రకటించారు. వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో బెస్ట్ ప్లాంట్ ను నిర్మిస్తామని, భవిష్యత్ లో విదేశాల నుంచి సైతం ఈ స్టీల్ ప్లాంట్ చూసేందుకే ఇక్కడకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.