జగనన్న విద్యా దీవెన ద్వారా  విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ను  చెల్లిస్తూ వస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను నేడు విడుదల చేయనుంది. సుమారు 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ.703 కోట్లను నేడు, మే 24న తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరులో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో.. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పటి వరకు 26,98,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన క్రింద జమ చేసిన ఆర్థిక సాయం రూ.10,636.67 కోట్లు అని గణాంకాలు విడుదల చేసింది.

దీనితో పాటుగా  ‘జగనన్న వసతి దీవెన’ ద్వారా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ వస్తోంది. 2017 సం॥ నుండి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ఇప్పటి వరకు అందించిన మొత్తం సాయం రూ. 14,912.43 కోట్లు అని తెలియజేసింది.

ఈ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ఇప్పటి వరకు 47 నెలల కాలంలో విద్యారంగం మీద చేసిన ఖర్చు మొత్తం అక్షరాల రూ.59,331.22 కోట్లు అని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *