ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని, 38.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ఇది గత సీజన్ కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నులు అధికం అన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. రాజదానిలోని డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్తో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు అనుకూల విధానాలతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని, కేంద్ర సహకారం ఆశించినంత లేకున్నా యాసంగి ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో సేకరిస్తున్నామన్నారు మంత్రి గంగుల. మంగళవారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 7000 కొనుగోలు కేంద్రాల ద్వారా 7907 కోట్ల విలువ గల ధాన్యాన్ని 6లక్షల 5వేల మంది రైతుల నుండి సేకరించామని, గత కొన్ని రోజులుగా సరాసరి రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు, ఇప్పటికే 400కి పైగా కొనుగోలు కేంద్రాల్లో సేకరణ పూర్తై మూసేసామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఎఫ్.సి.ఐ నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాలను రైతులు పాటిస్తే ఇబ్బందులు ఉండవని, అదికార యంత్రాంగంతో పాటు బాధ్యతగల ప్రతీ ఒక్కరూ ఈ అంశంపై అవగాహన పెంపొందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని మౌళిక వసతులను ఏర్పాటు చేసామన్నారు మంత్రి గంగుల కమలాకర్. అక్కడక్కడా ఎదురైతున్న ధాన్యం కొనుగోళ్లలోని సమస్యలపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం తక్షణం స్పందిస్తుందని, విపత్కర పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని మంత్రి అదేశించారు. ఇదే అంశంపై బుదవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో విడియో కాన్పరెన్స్ నిర్వహించి సమస్యలను మరింత వేగంగా పరిష్కరిస్తామన్నారు.

ఈ సమీక్షలో మంత్రితో పాటు పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, సంస్థ జీఎం రాజారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *