Saturday, January 18, 2025
HomeTrending Newsజోక్యం చేసుకోండి: జగన్ విజ్ఞప్తి

జోక్యం చేసుకోండి: జగన్ విజ్ఞప్తి

తెలంగాణ ప్రభుత్వం కేటాయింపుల కంటే అధికంగా నీటిని వాడుకుంటోందని, అనుమతులు లేకుండా విద్యుదుత్పత్తి చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.  ఈవిషయంలో తక్షణం కేంద్రం జోక్యం తీసుకోవాలని  కోరారు.  రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లకు జగన్ లేఖ రాశారు.

‘‘విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేయొద్దన్న ఆదేశాలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీటిని విడుదల చేస్తోంది. ఈ చర్యలు అంతర్రాష్ట్ర సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. కింది ప్రాంతాల హక్కులను కాలరాసేలా తెలంగాణ చర్యలున్నాయి. తెలంగాణ చర్యల వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగునీరుకు కూడా సమస్యలు తలెత్తుతాయి. ఎలాంటి వ్యవసాయ అవసరాలు లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ నీళ్లను వాడుకుంటోందని’’ సీఎం జగన్‌ లేఖలో పేర్కొన్నారు.

విద్యుత్‌ ఉత్పత్తి వద్దన్న కృష్ణా రివర్‌ బోర్దు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. తెలంగాణ అక్రమ వాడకంపై జూన్‌ 10న ఫిర్యాదు చేశాం. దీనిపై కృష్ణా రివర్‌ బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. తక్షణం విద్యుదుత్పత్తి నిలిపివేయాలని బోర్డు తెలంగాణకు సూచించింది. బోర్డు ఆదేశాలను తెలంగాణ పూర్తిగా బేఖాతరు చేసింది. జూన్‌ 23న, 29న మరోసారి కృష్ణా బోర్డు ఆదేశాలిచ్చింది. అక్రమంగా చేస్తున్న నీళ్ల వాడకం ఆపాలని తెలంగాణకు సూచించింది” అని జగన్‌ లేఖలో పేర్కొన్నారు.

విద్యుదుత్పత్తి పేరిట తెలంగాణ వాడుకుంటున్న కృష్ణా జలాలను తక్షణం నిలిపివేయాలని,  అక్రమంగా వాడిన నీటిని తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీలలో కలపాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని జగన్ కేంద్రాన్ని కోరారు.  కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాలను కూడా తెలంగాణ లెక్క చేయడంలేదని, ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని దీనితో ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ అనుమతి తోనే నీటి వినియోగం జరిగేలా ఆదేశించాలన్నారు.  ఒప్పందం ప్రకారం శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం బ్యారేజి నిర్వహణ బాద్యత ఏపీకి…  జూరాల, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల బాధ్యత తెలంగాణా ప్రభుత్వం చూస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాలపై కేంద్రం తక్షణం జోక్యం చేసుకొని సమస్య పరిష్కారం దిశగా అలోచించాలన్నారు. కేఆర్ఎంబీ పరిధిని కూడా నోటిఫై చేయాలని జగన్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్