Credit Seminar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయరంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే మన ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రైతు భరోసా, రుణాలు సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని పంట రుణాలు, క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు అమౌంట్‌ను వారి తరపున ప్రభుత్వమే చెల్లించడంతో పాటు ఆర్బీకేల ద్వారా ఇ– క్రాప్‌చేసి, పారదర్శకంగా చేస్తున్నామని వివరించారు. దాదాపు 10,700 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) సాగు రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన స్టేట్ క్రెడిట్ సెమినార్ 2022–23 సదస్సులో సిఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేట్ ఫోకస్ పేపర్ 2022–23 ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ….
⦿ 2020–21 ఆర్ధిక సంవత్సరానికి గానూ దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైంది.
⦿ ఫిబ్రవరి 11, 2022 నాటికి దేశవ్యాప్తంగా బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.115 లక్షల కోట్లు
⦿ ఈ విషయంలో ఏటా 7.86శాతం వృద్ధి మాత్రమే కనిపిస్తోంది
⦿ జీడీపీ పెరుగుదలతో సమాన స్థాయిలో ఇస్తున్న రుణాలు కూడా ఉండాలి.
⦿ సుస్థిర ఆర్థిక ప్రగతికి ఇది చాలా అవసరం. ఈ విషయంలో కొత్త వ్యూహాల దిశగా అడుగులు వేయాలి.
⦿ రాష్ట్రంలో రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ ఆర్బీకేలు చేదోడుగా నిలుస్తున్నాయి.
⦿ గ్రామ స్థాయిలో ఇ– క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాం.
⦿ ఇందు కోసం అవసరమైన సిబ్బందిని కూడా గ్రామసచివాలయాల్లో నియమించాం.
⦿ వ్యవసాయ రంగంలో ఇది విప్లవాత్మక చర్య.
⦿ రూరల్ నియోజకవర్గాల స్థాయిలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేశాం.
⦿ 147 నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేశాం.
⦿ ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం.
⦿ విప్లవాత్మకంగా వ్యవసాయరంగంలో గ్రామస్ధాయిలోనే పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నాం.
⦿ గ్రామస్ధాయిలోనే వ్యవసాయ మౌళిక సదుపాయాలనూ ఏర్పాటు చేస్తున్నాం.
⦿ ప్రైమరీ ప్రాససింగ్ సెంటర్లు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు, వ్యవసాయ ఉపకరణాల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం.
⦿ పార్లమెంటు నియోజకవర్గం యూనిట్‌గా సెకండరీ పుడ్ ప్రాససింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం.
⦿ దీనికి మీ సహాయ సహకారాలు కావాలి. రైతుల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికే ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం.
⦿ సహకార బ్యాంకులను, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం.
⦿ పారదర్శక విధానాలను తీసుకు వస్తున్నాం. ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు బ్యాంకులు, సొసైటీలకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు.
⦿ దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయమని అధికారులను ఇప్పటికే ఆదేశించాను.
⦿ ఫుడ్ ప్రాససింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టిపెట్టాం.
⦿ ఆర్బీకే, ఇ –క్రాపింగ్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌తో పాటు 542 సేవలను అందిస్తున్న గ్రామ సచివాలయాలు మనకు అందుబాటులో ఉన్నాయి.
⦿ వీటన్నింటిని ఒకే తాటిపైకి తీసుకువస్తున్నాం. బ్యాంకింగ్ కరస్పాండెంట్లు కీలకంగా వ్యవహరిస్తారు. రుణసదుపాయం కల్పనలో ఆర్బీకేలు
సంధానకర్తలుగా ఉండాలి.
⦿ వ్యవసాయం చేస్తూ..అర్హత ఉన్న ప్రతి రైతుకీ రుణం అందాలి. ఈ మేరకు బ్యాంకులతో సమావేశమై తగిన కార్యాచరణ ప్రణాలికతో తయారు చేయాలి.
⦿ ఈ మేరకు ఎస్‌ఓపీ తయారు చేయాలి. దీన్ని అమలు చేయడానికి కావాల్సిన ప్రణాళిక సిద్దం చేయాలి.
⦿ ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు వస్తాం.
⦿ వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామస్థాయిలోనే అభివృద్ధిచేస్తాం.
⦿ మనం ఇప్పుడు నానో ఫెర్టిలైజర్స్ వంటి టెర్మినాలజీ ఉపయోగిస్తున్న ఆధునిక యుగంలో ఉన్నాం.
⦿ దాన్ని అందుకునే దిశగా వ్యవసాయరంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టిపెడతాం.
వ్యవసాయంతో పాటు విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడు, రాయలసీమ కరవు, ఫ్లోరోసిస్ సమస్య, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం అంశాలను కూడా సిఎం జగన్ ప్రస్తావించారు. ఈసెమినార్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు, నాబార్డు ఛైర్మన్ డాక్టర్ జీ ఆర్ చింతల, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.