Monday, May 5, 2025
HomeTrending Newsరెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత నేడు

రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత నేడు

అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్సార్ చేయూత కార్యక్రమానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గత ఏడాది శ్రీకారం చుట్టింది.

పేద అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్ళలో దాదాపు రూ. 19,000 కోట్ల సాయం అందించే కార్యక్రమంలో భాగంగా వరసగా రెండో ఏడాది 23,14,342 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు జగన్‌.

నేడు అందిస్తున్న 4,339.39 కోట్లతో కలిపి వైఎస్సార్‌ చేయూత కింద ఇప్పటివరకు జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 8,943.52 కోట్లు.
వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద అక్కచెల్లెమ్మలకు ప్రతీ ఏటా రూ. 18,750 చొప్పున వరసగా నాలుగేళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్ధిక సాయం అందజేస్తారు.

ఇది కాక అడిగిన వారికి కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకలు వంటి అనేక జీవనోపాధి మార్గాలను సైతం చూపిస్తూ అమూల్, హెచ్‌యూఎల్, రిలయెన్స్, పీఅండ్‌జీ, ఐటీసీ, వంటి దిగ్గజ సంస్ధలు, బ్యాంకులతో అనుసంధానం చేయిస్తూ వారికి అండగా ఉంటోంది జగన్ ప్రభుత్వం.

ఇప్పటికే ప్రతీ నెలా సామాజిక ఫించన్లు అందుకుంటున్న 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల 6 లక్షలకు పైగా ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతోంది.

వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా పొందే డబ్బును ఉపయోగించుకోవడంలో అక్కచెల్లెమ్మలకు పూర్తి స్వేఛ్చ ఇస్తున్నారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు నడుపుకోవడానికి, ఇతర జీవనోపాధి కార్యక్రమాలకు వీటిని వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్