Sunday, September 8, 2024
HomeTrending Newsజగన్ ఏం చేస్తాడనేది ముఖ్యం కాదు: బాబు వ్యాఖ్యలు

జగన్ ఏం చేస్తాడనేది ముఖ్యం కాదు: బాబు వ్యాఖ్యలు

వైఎస్ జగన్ ఎక్కడ ధర్నా చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని…. ప్రజలకు ఏం చేస్తున్నామనేదే ముఖ్యమని  ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతోన్న నేపథ్యంలో చంద్రబాబు అధ్యక్షతన నేడు పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దీనిలో జగన్ ఢిల్లీ ధర్నా అంశం చర్చకు వచ్చింది.  జగన్ గురించి పట్టించుకోవద్దని, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై మాత్రమే దృష్టి పెట్టాలని బాబు ఎంపీలకు సూచించారు.

రాష్ట్రాభివృద్దే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీ పడి పని చేయాలని, ఢిల్లీలో జగనేం చేస్తాడో అనేది ముఖ్యం కాదని, మనమేం చేయాలనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని రాబట్టాలని హితవు పలికారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఎంపిలు రాష్ట్రమంత్రులను వెంటబెట్టుకుని కేంద్రమంత్రులను కలవాలని ఆదేశించారు.

కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవటానికి చంద్రబాబు కొత్త పధ్ధతిని ఎంచుకున్నారని, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రుల మధ్య వారధిగా ఎంపీలు ఉండాలని ఆదేశించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరగదని, దాన్ని లాభాల బాటలో నడిపించేందుకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా, అలాగే కొత్త మైన్స్ కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ కోసం అనువైన స్థలాన్ని త్వరలోనే కేటాయిస్తామని చెప్పారు.

వైఎస్ జగన్ కు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదని, జగన్ ఎంత తిరిగితే రాష్ట్రానికి అంత నష్టం జరుగుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హత్య రాజకీయాలును ప్రోత్సహించిన జగన్ ఏపిని ఆదోగతిపాలు చేశారని, ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. వినుకోండ లో ఇద్దరు వ్యక్తులు మధ్య సంఘటనను రాజకీయం చేస్తున్నారని, గతంలో మాచర్లనియోజకవర్గంలో చంద్రయ్య హాత్య జరిగినపుడు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.  జగన్  చేసిన అవినీతి భాగోతం డీల్లీలోనే కాదని, చివరకు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్