Saturday, November 23, 2024
HomeTrending Newsఅప్పులు, ఆత్మహత్యల్లో రాష్ట్ర రైతాంగం: బాబు

అప్పులు, ఆత్మహత్యల్లో రాష్ట్ర రైతాంగం: బాబు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు తాము ప్రాధాన్యం ఇచ్చామని, ఈ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేకపోతోందని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. హంద్రీనీవా ద్వారా పత్తికొండ, అలూరు ప్రాంతాలకు నీరు ఇవ్వాలని తాము సంకల్పించి పనులు మొదలు పెట్టామని…. వేదవతి, గుండ్రేవుల, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్ పై తాము ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక తట్ట మట్టి కూడా వేయలేకపోయారని విమర్శించారు. జిల్లాల విభజనలో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాలు ఏర్పడ్డాయని… నీరు బాగా పారే ప్రాంతమంతా నంద్యాలకే వెళ్లిందని, మంత్రాలయం తప్ప మిగిలిన దేవాలయాలు కూడా అటే వెళ్లాయని, తాను నిర్మించిన ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ కూడా నంద్యాల జిల్లాకే వెళ్లిందని వ్యాఖ్యానించారు.  బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు కోడుమూరులో జరిగిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడున్నర ఏళ్ళలో విపరీతంగా పన్నులు పెంచిందని, ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసిందని,  బాదుడే బాదుడు దెబ్బకు ప్రజలంతా ఆర్ధికంగా కుంగిపోయారని ఆవేదన వెలిబుచ్చారు. రోడ్లమీద గుంతలు పూడ్చలేనివారు మూడు రాజధానులు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడికి వచ్చేముందు తాను విద్యార్ధులు, యువతతో సమావేశమయ్యానని…’ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని.. మళ్ళీ మీరు రావాలి ఉద్యోగాలు ఇవ్వాలని’ యువత అంటున్నారని బాబు వెల్లడించారు.  రైతులు నాసిరకం విత్తనాలతో మోసపోతున్నారని, ఎకరాకు 50 వేల రూపాయలు ఖర్చుపెడితే కనీసం 5 వేలు కూడా గిట్టుబాటు లభించే పరిస్థితి లేదన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న, రైతాంగం అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని బాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి ఖర్మ పట్టిందని, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉందని, దీనికి కారణం జగన్ మోహన్ రెడ్డి అని, ఆయన్ను ఇంటికి పంపితే తప్ప రాష్ట్రానికి మోక్షం లేదని స్పష్టం చేశారు, అధికార పార్టీ నేతలు ఇసుక, మద్యం, మట్టి దోపిడీకి పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్