Sunday, November 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్Duvvuri Krishna: ఆర్థిక నిపుణుడి పేరుతో అనామక రాతలు: దువ్వూరి

Duvvuri Krishna: ఆర్థిక నిపుణుడి పేరుతో అనామక రాతలు: దువ్వూరి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపక్షంతో పాటు, ఆ పార్టీకి వత్తాసు పలికే మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్, ఎకనామిక్‌ అఫైర్స్‌) దువ్వూరి కృష్ణ ఆరోపించారు. దీనిలో భాగంగానే ఎవరికీ తెలియని, పరిచయం లేని వ్యక్తిని ఆర్థిక నిపుణుడిగా పరిచయం చేస్తూ, ఆయనతో ఒక ప్రకటన చేయించిన ఈనాడు పత్రిక, దాన్ని ప్రముఖంగా ప్రచురించిందన్నారు.

“ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పబ్లిక్‌ డొమెయిన్‌లో ఉన్నాయి. వాటిని విశ్లేషించి, మాట్లాడితే స్వాగతిస్తాం. కానీ ఎక్కడా ఏ విశ్లేషణ చేయకుండా, ఎక్కడా లెక్కలు చెప్పకుండా.. రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దిగజారిపోయిందని అర్ధంలేని ప్రకటన చేయించారు. ఒక అవగాహనతో మాట్లాడితే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ అవేవీ లేకుండా ఒక అనామకుడితో మాట్లాడించి, ఒక పత్రిక రాయడం దారుణం” అంటూ కృష్ణ ఆక్షేపించారు.

ఆర్బీఐ నివేదిక ప్రకారం విభజన నాటికి.. అంటే 2014, మార్చి 31 నాటికి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.1,96,202 కోట్లు, అప్పుడు తొలి రెండు నెలల్లో ఉన్న ద్రవ్య లోటు రూ.7,333 కోట్లు గా ఉందన్నారు.

విభజన తర్వాత 58 శాతం వాటా ప్రకారం లెక్కిస్తే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మిగిలిన అప్పు రూ.1,18,050 కోట్లు… ఐదేళ్ళలో 2019 మార్చి 31 నాటికి రూ.2.64 లక్షల కోట్లకు చేరుకుందని, ఆ తర్వాత రెండు నెలల్లో ద్యవ్యలోటు రూ.7,346 కోట్లు… దాన్ని కూడా కలుపుకుంటే 2019, మే లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర రుణం మొత్తం రూ.2,71,797.56 కోట్లుకు చేరుకుందని చెప్పారు.

ఆ తర్వాత తమ ప్రభుత్వ హయాంలో, అంటే ఈ నాలుగేళ్లలో రాష్ట్ర రుణం మొత్తం రూ.4,42,442 కోట్లకు చేరిందని, ఆర్బీఐ నివేదికలో ఇది స్పష్టంగా ఉందని వివరించారు.  ఇవి కాకుండా, ప్రభుత్వ పూచీకత్తుతో, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు… 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ. 14,028.23 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ. 59,257.31 కోట్లకు పెరిగాయన్నారు. ఈ నాలుగేళ్లలో.. ఈ ఏడాది మార్చి నాటికి ఆ రుణాల మొత్తం రూ.1,44,875 కోట్లకు చేరిందని, వీటిలో రూ.45 వేల కోట్లు విద్యుత్‌ రంగానికి చెందినవేనని, ఆ సంస్థలే ఈ రుణాలు తిరిగి చెల్లిస్తాయని… అందువల్ల ఈ  రుణాలన్నీ ప్రభుత్వానివి అని చెప్పడానికి అవకాశం లేదన్నారు.

“2014 నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పులు, ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రెండూ కలిపి రుణభారం రూ.1.32 లక్షల కోట్లు కాగా.. 2019లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ రుణాలు రూ.3.31 లక్షల కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లలో రాష్ట్ర రుణభారం రూ.5.87 లక్షల కోట్లకు చేరింది” అని దువ్వూరి విశ్లేషించారు.

ఇంకా ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు చూస్తే.. 2014 నాటికి విద్యుత్‌ రంగంలో జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అప్పులు రూ.18,374 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ అప్పుల మొత్తం రూ.59,692 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఇక ఈ ప్రభుత్వ హయాంలో, ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న ఆ రుణభారం రూ.56,017 కోట్లు ఉందన్నారు.

“2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2,893 కోట్ల బకాయిలు ఉండగా, 2019 నాటికి అవి రూ.21,540 కోట్లకు చేరాయి. అదే ఇప్పుడు ఆ బకాయిలు కేవలం రూ.8,455 కోట్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు.  మొత్తం మీద పబ్లిక్‌ డెట్‌ టు పబ్లిక్‌ ఎక్కౌంట్‌ (ప్రభుత్వ రుణాలు), ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు,  ఆ పూచీకత్తు లేకుండా చేసిన అప్పులు.. అన్నీ కలిపి చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం రుణాలు రూ.1,53,346.80 కోట్లు కాగా, గత ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ రుణాలు ఏకంగా రూ. 4,12,288 కోట్లకు పెరిగాయి. ఇక ఈ నాలుగేళ్లలో, అంటే ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రుణ మొత్తం రూ.6,51,789 కోట్లకు చేరింది. టీడీపీ హయాంలో 5 ఏళ్లలో దాదాపు రూ.2.58 లక్షల కోట్ల అప్పులు పెరగ్గా.. ఈ ప్రభుత్వ హయాంలో 4 ఏళ్లలో రూ.2.38 లక్షల కోట్లు పెరిగాయి. అంటే ఎలా చూసినా గత ప్రభుత్వంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కువ రుణాలు తీసుకోలేదన్నది స్పష్టమవుతోంది” అని కృష్ణ పేర్కొన్నారు.

“అంత బాధ్యతారహితంగా ఆ పత్రిక ఎలా రాసింది? ఎవరికీ పరిచయం లేని వ్యక్తితో మాట్లాడించి, అలా ప్రచురించడం ఎంత వరకు సబబు? ఇది అభ్యంతరకరం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, అలా బాధ్యతారహితంగా ప్రచురించడం దారుణం. సీఏజీఆర్‌ ప్రకారం చూసినా, టీడీపీ హయాం కంటే, ఈ ప్రభుత్వ హయాంలో అప్పులు తక్కువగా పెరిగాయి. అయినా అదే పనిగా బురద చల్లడం దారుణం” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్