విద్యుత్ చార్జీల విషయంలో వినియోగదారులకు జగన్ ప్రభుత్వం ఊరట కలిగించింది. ట్రూ అప్ ఛార్జీలకు సంబంధించిన ఆదేశాలు రద్దు చేసింది. గతంలో వీటి వసూలుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఏపీఈఆర్‌సీ వెనక్కి తీసుకుంది. ఛార్జీల పెంపు విషయంలో సరైన పద్ధతి పాటించలేదని హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో పాటు వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత దీనిపై తుది ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోంది.
వినియోగదారుల నుంచి రూ.3,666 కోట్లు వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ ఆగస్టు నెలలో ఈఆర్‌సీ ఆదేశాలిచ్చింది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో విద్యుత్ పంపిణీ సంస్థలకైన అదనపు ఖర్చుల కింద వీటిని వసూలు చేయాలని గతంలో నిర్ణయించారు. సెప్టెంబరు నుంచి ఈ ట్రూప్ అప్ ఛార్జీలు వసూలు మొదలుకాగా దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనల ప్రకారం ట్రూ అప్ ఛార్జీల విధించే ముందు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ప్రజాభిఫ్రాయ సేకరణ జరగలేదని పలువురు పిటిషన్లలో పేర్కొన్నారు. దీంతో ఏపీఈఆర్‌సీ ట్రూ అప్ ఛార్జీలకు సంబంధించిన ఆదేశాలను ఉపసంహరిస్తున్నట్లు మండలి ఈఆర్‌సీ వెబ్‌సైట్‌లో వెలువరించిన ఉత్తర్వులో పేర్కొంది.
ఈ ట్రూ అప్ ఛార్జీలపై ఈ నెల 19న ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్లు ఈఆర్‌సీ తెలిపింది. ప్రజాభిప్రాయ సేకరణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్నట్లు వెల్లడించింది.