తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన నగదు జమ చేస్తున్న విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. తల్లుల ఖాతాల్లో వేస్తే జవాబుదారీ తనం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నామని, నేరుగా యాజమాన్యానికి ఇస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారని అయన ప్రశ్నించారు. 40 శాతం మంది విద్యా దీవెన నగదును కాలేజీలకు చెల్లించడం లేదన్న వార్తలను పరిశీలన చేస్తున్నామని చెప్పారు. విద్యార్దులకు 70 శాతం హాజరు ఉంటేనే రెండో విడత విద్యాదీవెన అందిస్తున్నామని తెలిపారు.
ఇంటర్ అడ్మిషన్లలో పాత విధానం అమలు విషయంలో కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. పారదర్శకత కోసమే ఆన్ లైన్ అడ్మిషన్ల విధానం ప్రవేశపెట్టామని, రిజర్వేషన్లు కూడా పక్కాగా అమలవుతాయని అయన స్పష్టం చేశారు. విద్యార్ధులకు అన్ని విధాలుగా న్యాయం చేయడమే ప్రభుత్వ విధానమని మంత్రి వివరించారు.
విద్యాసంస్థల్లో కరోనా కేసులపై తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 10 కంటే ఎక్కువ కేసులు వస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నామని, అతి త్వరలో టీచర్లకు వంద శాతం వ్యాక్సిన్ పూర్తి చేస్తామని ప్రకటించారు.